ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి కుర్చీ అంటే ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వల్లమాలిన ప్రేమ. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుభవించిన అధికారం చూసి మోజు పడ్డారో.. ప్రజాసేవకు అంతకు మించిన మార్గం లేదనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఆయన సీఎం కుర్చీనే టార్గెట్ గా చేసుకున్నారు. 

ఓ రాజకీయ నాయకుడిగా ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవడాన్ని ఏమాత్రం తప్పుబట్టలేం. కానీ ఆ పదవి సాధించేందుకు తగిన పరిశ్రమ జగన్ చేయలేదన్న వాదన ఉంది. అందులోనూ తండ్రి శవం పక్కన పెట్టుకుని మరీ సంతకాలు సేకరించాడన్న అపవాదు కూడా ఉంది. అంతేకాదు.. వైఎస్ హఠాన్మరణం తర్వాత కాస్త ఓపిక పట్టి ఉంటే.. ఈ పాటికి సీఎం కుర్చీ దక్కి ఉండేదన్న వాదన కూడా ఉంది. 

జగన్ పై గాలి శాపాలు.. ఫలించేనా..?

Image result for gali muddu krishnama naidu mlc
సరే.. ఏదేమైనా గతం గతహ.. ఇప్పుడు జగన్ సీఎం కావాలంటే మాత్రం ఇంకో నాలుగేళ్లు ఎదురు చూడాలి. ఈ నాలుగేళ్లు తనను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం జనంలో కలిగించాలి. ప్రజాసమస్యలపై పోరాడి.. వారిలో నమ్మకం కలిగించాలి. ఐతే.. టీడీపీ నేతలు మాత్రం జగన్ పై శాపానార్థాలు పెడుతున్నారు. 

జగన్ అంటే అంతెత్తున ఎగిరిపడే గాలి ముద్దుకృష్ణమనాయుడైతే.. ఏకంగా జగన్ తన జీవితంలో ఏనాడూ ముఖ్యమంత్రి కాలేరని కుండబద్దలు కొట్టేస్తున్నారు.  జగన్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. హంద్రీ నీవా ఆయన కట్టేదీ లేదని ముద్దు కామెంట్ చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేసి వచ్చిన జగన్.. ఫోన్ ట్యాపింగ్ పై మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని గాలి విమర్శించారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని ఓ సామెత. మరి టీడీపీ శాపనార్థాలు ఫలిస్తాయి. జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరా.. ఇది కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. 


మరింత సమాచారం తెలుసుకోండి: