అసలే తెలంగాణ రాష్ట్రానికి దక్కవలసిన పలు ప్రయోజనాలకు సంబంధించి.. ఆంధ్ర పాలకులు ఇప్పటికీ అడ్డుపడుతున్నారనే విమర్శలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం తెలంగాణ ద్రోహానికి పాల్పడుతున్నదనే విమర్శలూ తరచూ వినిపిస్తున్నాయి. అయినా సరే... సాక్షాత్తూ తెలుగుదేశం కు చెందిన కేంద్రమంత్రి శాఖలోనే ఉన్న సమస్యకు ఆయన మాత్రం పరిష్కారం చూపలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి విషయంలో తానేమీ చేయలేనంటూ ఆయన చేతులెత్తేశారు. మొత్తానికి హైదరాబాదు బేగంపేట లోని ఎయిర్‌పోర్టు.. రాష్ట్రప్రభుత్వానికి చెందకుండా.. కేంద్ర రక్షణశాఖ పరమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. 


హైదరబాదులో దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన తర్వాత.. బేగంపేట ఎయిర్‌పోర్టు ఖాళీ అయిపోయింది. అప్పుడప్పుడూ రాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీలు ప్రత్యేక విమానాల్లో వచ్చే సందర్భాలు, యుద్ధ విమానాల కోసం తప్ప.. ఈ విమానాశ్రయానిన వాడడం లేదు. దీనిని ఇక తమకు అప్పగించేయాల్సిందిగా రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాసింది. 


అయితే పార్లమెంటు సమావేశాలకు ముందు.. తెదేపాకు చెందిన అశోక్‌ గజపతి రాజు.. బేగంపేట ఎయిర్‌పోర్టు తెలంగాణకు దక్కకుండా కుట్ర చేస్తున్నారంటూ ఎంపీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయంలో తాము ఎంతవరకైనా పోరాడతాం అంటూ ప్రకటించారు. ఈ విషయంపై కేసీఆర్‌ గతంలో మోడీకి లేఖ కూడా రాసిన ప్రయోజనం కనిపించలేదు. తాజాగా ఢిల్లీలో ఉన్న తుమ్మల, తదితర ఎంపీంతా కలిసి.. విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజును కూడా కలిసి ఈ విషయం విన్నవించారు. 


అయితే తన శాఖకు సంబంధించినంత వరకు తానేమైనా చేయగలను గానీ.. రక్షణశాఖకు సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకోలేనంటూ ఆయన చేతులెత్తేయడం విశేషం. ఈ విషయంలో రక్షణశాఖనే సంప్రదించాలని చెప్పేశారు. దీంతో ఇక బేగంపేట ను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కించుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ ఎయిర్‌పోర్టు అందుబటులోకి వస్తే.. విమానాలకు సంబంధించిన యూనివర్సిటీ నెలకొల్పాలని కేసీఆర్‌ అనుకున్నారు. అది బహుశా కుదరకపోవచ్చు. 


కాకపోతే.. కొత్తగూడెంలో విమానాశ్రయం కావాలన్న తుమ్మల బృందం కోరిక పట్ల మాత్రం అశోక్‌ గజపతి సానుకూలంగానే స్పందించారు. ముందు స్థలం సేకరించి ఇవ్వాలని చెప్పారు. స్థలం చూపిస్తే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన హామీ ఇవ్వడం కొంతలో కొంత ఊరటగా పాపం.. తెరాస ప్రభుత్వ ప్రతినిధులు తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: