ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలాం.. దివ్యస్మృతికి అద్భుతమైన గౌరవం దక్కింది. తన జీవితాన్నంతా పరిశోధనలకు ధారపోసిన మహనీయుడు అబ్దుల్‌ కలాం.. తనకు అత్యంత ఇష్టమైన పనిగా.. నిత్యం విద్యార్థులతో కలుస్తూ ఉంటారనే సంగతి అందరికీ తెలుసు. ఆయన ఎలాంటి పర్యటనలో ఏ ఊరికి వెళ్లినా కూడా అక్కడి విద్యార్థులతో భేటీ కావడం కలాం తప్పకుండా చేసే పని..!! అలాంటిది.. ఆయన జన్మదినోత్సవాన్ని ''అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం''గా ఐక్యరాజ్యసమితి మంగళవారం నాడు ప్రకటించింది. ఒక భారతీయ శాస్త్రవేత్తకు, రాష్ట్రపతిగా సేవలందించిన మహనీయునికి ప్రపంచవ్యాప్తంగా దక్కిన అరుదైన గౌరవంగా దీన్ని మనం భావించాలి. 


అబ్దుల్‌ కలాం.. తాను శాస్త్రవేత్తగా పనిచేస్తున్న కాలంలో కూడా విద్యార్థులతో ఇంటరాక్ట్‌ కావడాన్ని చాలా ఇష్టంగా భావించేవారు. రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆయన ఆ అలవాటును మానుకోలేదు. ఏ నగరానికి పర్యటనకు వెళ్లినా.. కచ్చితంగా అక్కడి విద్యార్థులతో ఒక కార్యక్రమం ఉండేది. తనకు తెలిసిన మంచి విషయాలను భావి భారత పౌరులతో పంచుకుంటూ.. వారిలో దార్శనిక, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఆయన ప్రయత్నిస్తుండేవారు. 


కలలు కనండి.. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి కష్టపడండి..!! కలలు అంటే.. నిద్రపోయినప్పుడు వచ్చేవి కాదు.. మనకు నిద్ర రానివ్వకుండా చేసేవి.. అనే సందేశాలన్నీ ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చినవే. విద్యార్థులు అంటే కలాంకు ఎంతో ప్రీతి. 


ఆయన హఠాన్మరణాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి చాలా ఘనంగానే సత్కరించింది. అబ్దుల్‌ కలాం జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు అంకితం చేసింది. కలాం.. 1931 అక్టోబరు 15న జన్మించారు. ఆయన జన్మదినం ఇకపై 'అరతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం'గా చెలామణీలో ఉంటుంది. ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం ఇది. 



మరింత సమాచారం తెలుసుకోండి: