హైదరాబాదులో సెక్షన్‌ 8 అమలు అనే వ్యవహారం ఇక పూర్తిగా అటకెక్కినట్లే. విభజన చట్టంలో భాగమైన ఈ సెక్షన్‌ను అమలు చేయించేలా సూచనలు ఇచ్చే పని తమ పరిధిలోది కాదని.. కేంద్రం హోం శాఖ చేతులు దులిపేసుకుంది. ఇది పూర్తిగా గవర్నరు విచక్షణ కిందికే వస్తుందని తేల్చేసింది. ఒక రకంగా ఇది చంద్రబాబు ప్రయత్నాలకు అశనిపాతం లాంటిది. హైదరాబాదులో శాంతిభద్రతలను పర్యవేక్షించే అధికారాలను మొత్తం గవర్నరు చేతిలోకి తీసుకునేలాగా ఆదేశించాలంటూ.. కేంద్రంలో తన మాటలను ఆలకించే వారు అధికారంలో ఉన్నారు గనుక.. చంద్రబాబు నాయుడు అట్నుంచి నరుక్కు రావడానికి ప్రయత్నించారు. కానీ.. వ్యవహారం బెడిసికొట్టింది. 


హైదరాబాదు నగరం పదేళ్ల పాటూ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన అవసరం ఉన్నది గనుక.. ఈ పదేళ్ల కాలంలో.. ఏపీకి చెందినప్పటికీ.. రాజధాని ఉన్నందున ఇక్కడ నివసిస్తూ ఉండే ఆంధ్రప్రాంత ప్రజలు, ఇతరులకు శాంతి భద్రతల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా, వారిలో అలాంటి ఆందోళన ఏర్పడకుండా ఉండేందుకు ఈ సెక్షన్‌ 8 నిబంధనను విభజన చట్టంలో పొందు పరిచారు. ఆంధ్రప్రాంతం వారి ఆస్తులకు నష్టం కలుగుతున్న, శాంతిభద్రతల పరంగా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితులు ఉన్నప్పుడు.. హైదరాబాదు నగరం వరకు పోలీసు వ్యవస్థ పర్యవేక్షణను గవర్నరు స్వయంగా తన చేతిలోకి తీసుకోవచ్చునని ఈ చట్టం చెబుతుంది. ఆ సెక్షన్‌ మేరకు పోలీసుల నియంత్రణ, నియామకాలు సహా గవర్నరు చూస్తారు. అవసరమైతే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాలు తీసుకుంటారు... అనేది చట్టంలోని భాగం. 


అయితే ఇది గవర్నరు విచక్షణాధికారంగా మాత్రమే చట్టంలో ఉంది. కాకపోతే.. ఓటుకు నోటు కేసు బయటపడిన తర్వాత.. ఫోన్‌ ట్యాపింగ్‌ పేరిట తె-సర్కారుపై ఎదురుదాడికి దిగిన చంద్రబాబు.. కేంద్రం ద్వారా గవర్నరు ఆ అధికారాలు తీసుకునేలా చూడాలని ప్రయత్నించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాధ్‌లను ఆ మేరకు కోరారు. అయితే రాజ్‌నాధ్‌ అప్పట్లోనే.. అది హోం సెక్రటరీ చూసుకుంటారని చెప్పేశారు. హోం సెక్రటరీ హైద్రాబాద్‌ వస్తున్నారని, సెక్షన్‌ 8 వచ్చేస్తుందని ఒకరోజంతా ఊదరగొట్టారు కూడా. తాజాగా హోం సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో మాట్లాడుతూ.. సెక్షన్‌ 8 బాధ్య త మొత్తం గవర్నరుదే అని తేల్చిచెప్పేశారు. కేంద్రం కేవలం రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు రాకుండా సమావేశాలు మాత్రం నిర్వహిస్తుందన్నారు. దీంతో.. చంద్రబాబు ప్రయత్నాలకు గండిపడ్డట్లుగా అయిపోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: