ఛార్జిషీటు దాఖలైంది. ఓటుకు నోటు కేసు విచారణ ఒక దశ వరకు కొలిక్కి వచ్చినట్లే. అయితే తొలినాడు కేసులో ఇరుక్కున్న నలుగురు వ్యక్తుల పేర్లు మాత్రమే ప్రస్తావిస్తూ ఏసీబీ పోలీసులు కేసు దాఖలు చేశారు. అయితే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందుతున్నట్లుగా పెద్దతలకాయల పేర్లు ఏవీ ఈ చార్జిషీటులోకి రాలేదు. అయితే చార్జిషీటు దాఖలైన పోకడను, ఇంకా దర్యాప్తు మిగిలి ఉందన్న సంకేతాలను పరిశీలిస్తున్న వారు మాత్రం.. కేసు ఇక్కడితో ముగిసినట్లు కానే కాదని.. ఇక్కడితో అయిపోయిందని.. ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్నవారు ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదని అంచనా వేస్తున్నారు. 


39 మంది సాక్షులను కూడా విచారించిన ఏసీబీ పోలీసులు తొలిరోజు కేసులో పేర్కొన్న నలుగురి పేర్లతోనే చార్జిషీటు దాఖలు చేశారు. మత్తయ్య ఇప్పటికీ అరెస్టు కాకపోగా, మిగిలిన వారిలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయసింహ ప్రస్తుతం బెయిలుమీదే ఉన్నారు. ఫిర్యాదు చేసిన స్టీఫెన్సన్‌నుంచి రేవంత్‌ డ్రైవరు వరకు మిగిలిన వారినంతా సాక్షులుగానే విచారించారు. 
ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలుగా ఫోరెన్సిక్‌ నివేదికలను కూడా ఏసీబీ కోర్టుకు సమర్పించింది. రేవంత్‌రెడ్డి పట్టుబడిన వీడియోలు గానీ, స్టీఫెన్సన్‌ లేదా సెబాస్టియన్‌ ఫోనుల్లో రికార్డు అయినట్లుగా చెబుతున్న ఫోను సంభాషణల టేపులు గానీ.. అన్నీ ఒరిజినల్‌ వేనని ఫోరెన్సిక్‌ నివేదికలు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. 


అయితే ఈ కేసు వ్యవహారంలో సండ్ర వెంకటవీరయ్య కూడా కీలకంగా ఇరుక్కుంటాడని అంతా అనుకున్నారు. ఆయనను ఏసీబీ విచారించిన తర్వాత.. రేవంత్‌ కంటె ముందు.. ఎమ్మెల్యేల కొనుగోలు, స్టీఫెన్సన్‌ కోసం కూడా బేరాలు నడిపింది ఆయనే అని కూడా వార్తలు వచ్చాయి. ఆ మేరకే ఫోను సంభాషణలన్నీ తేల్చాయి కూడా. అయితే సండ్ర పేరు ప్రస్తుతం ఇందులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఏసీబీ వారు ''లంచం ఇవ్వజూపడం'' అనే నేరం కంటె కీలకంగా ''50 లక్షల బ్లాక్‌మనీ'' అనే కేసును కూడా తీవ్రంగా నిగ్గు తేల్చాలని భావిస్తున్నారు. ఆ మూలాలు కనుక్కోవడం కోసమే సండ్ర పేరు ఇందులో పెట్టలేదని తెలుస్తోంది. డబ్బు మూలాలు తేల్చేలోగా.. తెదేపా పెద్దతలకాయల పేర్లు వస్తాయని అనుకుంటున్నారు. 


వాళ్లంటున్న అనుబంధ చార్జిషీట్లు కూడా దాఖలు కావాల్సి ఉంది. అప్పటిదాకా పార్టీలు కొందరికి నిద్రలేని రాత్రులు తప్పవన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: