తాజ్‌ హోటల్‌ మీద దాడిచేసి.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన వ్యక్తిని ఉరితీశారు. సాధారణంగా ఉరిని వ్యతిరేకించేవారు.. అతని తరఫున కూడా మాట్లాడారు కానీ.. పెద్దగా ఉత్కంఠ, మీమాంస నడవలేదు. సరిగ్గా పోల్చిచూస్తే తాజ్‌ మీద దాడికంటె తీవ్రమైన నేరం ముంబాయి పేలుళ్లు. ఈ ఉగ్రవాద దాడుల వెనుక కీలక నిందితుడు యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష అనేది దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చగా మారిపోతున్నది. కొన్నిదేశాల్లో.. తప్పుడు పనులకు పాల్పడిన వారిని.. విచక్షణా రహితంగా బహిరంగంగా తలలు నరికేస్తూ శిక్షలు అమలుచేస్తూ ఉండగా... ఒక ఉగ్రవాదికి సుదీర్ఘ కాలం విచారణల తర్వాత ఉరిశిక్ష విధిస్తే.. దాని గురించి ఇంత పెద్ద చర్చ జరగడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ కేసులో ఇంత సంక్లిష్టత ఉన్నదా అనే అనుమానం కలుగుతోంది. 


ఈ కేసు గురించి కూడా ఇంతలా మాట్లాడుకోవడనికి ఏమీ లేదు. ఉరిశిక్ష పడినప్పుడు.. అతని బంధువులు క్షమాభిక్ష కోసం పిటిషన్‌ పెట్టుకోకుండా ఉండరు. ఈ కేసులో దానిని రాష్ట్రపతి రిజెక్ట్‌ చేశారు. సుప్రీంలో ఓ క్షమాభిక్ష పిటిషన్‌ వేశారు. అక్కడినుంచే డ్రామా మొదలైంది. తొలుతే ఈ కేసును త్రిసభ్య బెంచ్‌కు అప్పగించి ఉన్నా ఇలాంటి చర్చ మొదలయ్యేది కాదు. అయితే ద్విసభ్య బెంచ్‌కు ఇవ్వడం న్యాయమూర్తులు ఇద్దరూ పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో తగాదా వచ్చింది. వ్యవహారం రచ్చకెక్కింది. ఒకరు పిటిషన్‌ కొట్టేయాలని, ఒకరు ఉరిని ఆపాలని అభిప్రాయాలుచెప్పడంతో వాతావరణం వేడెక్కింది. 


అంటే సుప్రీం న్యాయమూర్తుల్లో కూడా.. ఈ ఉరిశిక్ష సరైనది కాదనే అభిప్రాయం ఒక్కరిలోనైనా ఉన్నది అనే సంగతి బాహ్య ప్రపంచానికి తెలిసింది. 
కానీ వాస్తవంగా ఆలోచిస్తే.. ఈ కేసులో ఇంత సంక్లిష్టత అంత ఉన్నదా అని సందేహం కలుగుతుంది. ముంబాయి పేలుళ్లు అనేది ఈ జాతి మొత్తం మరచిపోలేని దుర్ఘటన. వాటికి సూత్రధారుల్లో ఒకడంటే.. ఉరికి మించి వేరే శిక్ష వేయలేరు అనే ఎవ్వరైనా అనుకుంటారు. దానికి తోడు.. ఇవాళ త్రిసభ్య బెంచ్‌ కేసును విచారిస్తుండగా.. పేలుళ్లలో మృతిచెందిన కుటుంబాల వారంతా వచ్చి.. ఉరిశిక్షను రద్దు చేయవద్దంటూ.. ప్రత్యేకంగా వారి విజ్ఞప్తులు వారు చేస్తున్నారు. నిందితుడి పాత్ర, ఉగ్రవాద నేపథ్యం తేలినప్పుడు శిక్ష కూడా తేలిపోవాలి. కానీ ఎందుకు మీమాంస నడుస్తున్నదో బోధపడడం లేదు. ఏదో ఒకటి తేల్చేయకుండా దీనిని సాగదీసే కొద్దీ.. 'నేరము- శిక్ష' పట్ల జనాభిప్రాయం కూడా ఎన్ని రకాలుగా మారిపోతుందో ఏమో చూడాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: