మా అస్తిత్వాన్ని కాపాడండి.. కేంద్రానికి టీ-వినతి 
తెలంగాణ అనేది భారతదేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా ఆవిర్భవించింది. మరి ఈ విషయాన్ని తతిమ్మా దేశం గుర్తించిందా లేదా? గుర్తించిన ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. అందుకే మా అస్తిత్వాన్ని గుర్తించండి సార్లూ అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ రాసింది. అధికారిక నోటిఫికేషన్లలో తెలంగాణ పేరు కూడా చేర్చాలంటూ ఆ లేఖలో తెలియజేసింది. 


తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది.. ఇక్కడ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నది.. బంగారు తెలంగాణను సృష్టిస్తాం అంటున్నది.. ఇక్కడి సీఎం చాలా రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. అధికారిక నోటిఫికేషన్లలో తెలంగాణ పేరు మాత్రం జత కావడం లేదు. ఎవ్వరికైనా ఇది కాస్త బాధగానే ఉంటుంది. అందుకే తెలంగాణ సర్కారు కూడా తమ ఆత్మగౌరవాన్ని తాము కాపాడుకోవడం అనే ఎజెండాతో రాష్ట్రం సాధించుకున్న తర్వాత, తమ అస్తిత్వాన్ని తాము కాపాడుకోవడం అనే పనిలో పడింది. 


అన్ని ప్రభుత్వాల నోటిఫికేషన్లలో తెలంగాణ రాష్ట్రం పేరును కూడా ప్రస్తావించేలా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు, రాష్ట్రాలకు సూచిస్తూ ఒక సర్కులర్‌ జారీ చేయాలని తెరాస ఎంపీ వినోద్‌ హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌కు ఒక లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయి ఏడాది గడుస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ఆ విషయాన్ని రికార్డుల్లోకి ఎక్కించకపోవడం పట్ల ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణ అస్తిత్వాన్ని ఘనంగా మిగిలిన దేశానికి తెలియజేసే ప్రయత్నంలో నేతలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: