ముంబాయి బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్‌ మెమన్‌ కు న్యాయస్థానం విధించిన ఉరిశిక్ష గురువారం ఉదయం 6.43 గంటలకు నాగపూర్‌ జైల్లో అమలు అయింది. పుట్టినరోజునాడే యాదృచ్ఛికంగా యాకూబ్‌ మెమన్‌ మరణశిక్షను అనుభవించారు. ఆయన తన చివరి కోరిక కింద కుటుంబ సభ్యులతో విడిగా కొద్దిసేపు గడిపారు. అనంతరం జైలు అధికారులు అతణ్ని ఉరితీసి, మరణించిన విషయాన్ని ధ్రువీకరించారు. ఖననం నిమిత్తం మృతదేహాన్ని.. అతని బంధువులకు అప్పగిస్తాం అని చెప్పారు. 


యాకూబ్‌ ఉరి సందర్భంగా కేంద్రప్రభుత్వం దేశమంతా హైఅలర్ట్‌ ప్రకటించింది. మతఘర్షణల పరంగా సునిశిత ప్రాంతాలైన, ఇస్లామిక ఉగ్రవాద జాడలు ఉన్న నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నాగపూర్‌లో పూర్తిగా 144 సెక్షన్‌ విధించారు. జైలు వద్ద భద్రతను కూడా విపరీతంగా పెంచారు. మెమన్‌ ఉరి సందర్భంగా దేశంలో ఎక్కడో ఒకచోట అల్లర్లు జరగవచ్చునేమోనని.. బుధవారం రాత్రి అంతా పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరించారు. పలు ప్రాంతాల్లో పాత నేరస్తులు అందరినీ అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇన్ని రకాల జాగ్రత్తల నడుమ యాకూబ్‌ మెమన్‌ను గురువారం ఉదయం ఉరి తీశారు. 


ఉరిశిక్ష అనంతరం నాగ్‌పూర్‌ జైలులోనే యాకూబ్‌ మృతదేహానికి పోస్టుమర్టం నిర్వహించారు. ఉరి సమయంలో హాజరైన డాక్టరు.. యాకూబ్‌ మరణించినట్లుగా 7.01కి ధ్రువీకరించారు. యాకూబ్‌ మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు. అతని మృతదేహానికి ముంబాయిలోని బాదా కబరిస్తాన్‌ లేదా మాహిం లలో అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది. యాకూబ్‌కు ఉరిశిక్ష అమలు చేయడంపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 


అర్ధరాత్రి బర్త్‌డే కేక్‌

యాకూబ్‌ మెమన్‌ గురువారం నాడు తన 53వ పుట్టినరోజును జరుపుకున్నారు. కొన్ని గంటల్లో ఉరిశిక్ష అమలవుతుందనగా.. ఆయన కుటుంబ సభ్యులు ఆయనకోసం బుధవారం అర్ధరాత్రి ఓ బర్త్‌డే కేక్‌ను కూడా పంపినట్లుగా ఎన్‌డిటివి ఓ కథనం అందించింది. నిజానికి వారు మంగళవారం నాడే బర్త్‌డే కేక్‌కు జైలు అధికారుల అనుమతి తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: