ముంబాయి బాంబుపేలుళ్ల నిందతుడు యాకూబ్‌ మెమన్‌ను నాగ్‌పూర్‌ జైలులో ఉరితీయడం పూర్తయిపోయింది. దీనికి సంబంధించి.. మూడు నాలుగు రోజుల కిందట మొదలై గురువారం ఉదయం  5 గంటల వరకు తారస్థాయికి చేరుకున్న ఉత్కంఠ 6.45 గంటలకు ముగిసిపోయింది. అతణ్ని ఉరి తీసేసారు. అయితే ఉరి సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. మెమన్‌ ఉరికి అనుకూల- ప్రతికూల వాదనలు పెరిగిపోయాయి. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉరిశిక్ష నిర్ణయంతో విభేదిస్తూ మాట్లాడడం మొదలైంది. మొత్తానికి ఈ చర్చకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. ఉరిశిక్ష అమలైపోయింది. 


అయితే ఇప్పుడు మెమన్‌కు అనుకూలంగాను, ప్రతికూలంగాను దేశంలో ప్రజలు, ప్రధానంగా యువతరం రెండు వర్గాలుగా తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మిత్రులతో చర్చల్లో మాట్లాడుకోవడం బాగానే ఉంటుంది గానీ.. పబ్లిక్‌లోకి వెళ్లేలా ఇతరులను ప్రభావితం చేసేలా తమ అభిప్రాయాలు వ్యక్తం అయ్యేప్పుడు వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే అనిపిస్తోంది. 


ఎందుకంటే ఇవాళ్టి రోజుల్లో.. వ్యక్తిగత అభిప్రాయాల్ని స్వేచ్ఛగా (విచ్చలవిడిగా) వెల్లడించడానికి, సోషల్‌నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లు బాగా అందుబాటులో ఉన్నాయి. ఎవరు ఎలాంటి అభిప్రాయాన్నయినా పంచుకోవచ్చు. ఒక దశ దాటి శృతిమించితే.. ఇలా వ్యక్తమయ్యే అభిప్రాయాలు.. పదుగురిని పోగేయడానికి కూడా దారి తీస్తుంటాయి. అందుకే ఉరి పూర్తయిన వెంటనే సోషల్‌ మీడియా మీద కూడా పోలీసులు చాలా కీలకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. 


మెమన్‌ ఉరిశిక్షకు సంబంధించి ఎవరైనా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ తదితర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలు పెడితే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం అని పోలీసులు 
హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు, యువతరం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఎవరో ఏదో పెడితే.. దాన్ని తిడుతూ, పొగుడుతూ కామెంట్లు పెట్టడం, కొన్నింటికి లైకులు కొట్టడం వంటివి కూడా.. యూజర్లను ఇబ్బందుల్లోకి నెట్టేసే ప్రమాదం ఉంది. అందుకే మెమన్‌ ఉరిశిక్షకు సంబంధించి ఎలాంటి తీవ్రమైన భావావేశాన్ని పంచుకోకుండా.. సోషల్‌ నెట్‌వర్కింగ్‌లో బిజిగా గడిపేవారు జాగ్రత్తగా ఉంటే మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: