ఒకప్పట్లో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల్లో ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యే, ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లోనే కేసీఆర్‌మీద తొడగొట్టి సవాళ్లు విసరగల స్థితిలో ఉన్నటువంటి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకుంటున్నారు. సంగారెడ్డిలో తన బలం గురించి ఎన్ని సవాళ్లు విసిరిప్పటికీ గత సార్వత్రిక ఎన్నికల్లో తెరాస చేతిలో దారుణంగా పరాజయం పాలైన తర్వాత.. ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్న రేంజిలో చాలాకాలం మౌనంగా ఉండిపోయారు. కేసీఆర్‌ రాజీనామా పర్యవసానంగా మెదక్‌ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భాజపా తరఫున బరిలోకి దిగారు. కేసీఆర్‌ బరిలో లేడు గనుక.. విజయం దక్కవచ్చుననే ఆశతో భారీ ఖర్చుకు కూడా తెగించారు. కానీ పరాజయం తప్పలేదు. ఆ తర్వాత మళ్లీ రాజకీయంగా మౌనంగా ఉండిపోయారు. కాంగ్రెస్‌కు ముందు జగ్గారెడ్డి భాజపాలోనే ఉండేవారు. అప్పట్లో విజయశాంతి కూడ భాజపా నాయకురాలే. ఆమెకు రాజకీయ గురువుగానూ జగ్గారెడ్డి ఉన్నారు. భాజపాలో ఎంపీ అభ్యర్థిగా ఆయన సెకండిన్నింగ్స్‌ సవ్యంగా సాగలేదు. పార్టీ వైఖరితో చాలాకాలం అసంతృప్తిగానే గడిపినట్లు సమాచారం. 


చివరికి ఇప్పుడు జగ్గారెడ్డి తనకు ఎమ్మెల్యేగా చీఫ్‌ విప్‌గా పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్‌ గూటికే చేరడానికి నిశ్చయించుకున్నారు. ఆ మేరకు ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయసింగ్‌ను గురువారం నాడు కలిసి, చేరిక విషయాన్ని ధ్రువీకరించబోతున్నారు. 


ప్రస్తుతం తెరాస సర్కారు మీద దూకుడుగా విరుచుకుపడుతూ.. తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలని ఉబలాటపడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి.. కేసీఆర్‌ అంటేనే ఇంతెత్తున లేచే జగ్గారెడ్డి వంటి నాయకులు బాగానే ఉపయోగపడవచ్చు. అలాగే.. రాజకీయ భవిష్యత్తు పరంగా మిగిలిన మార్గాలేవీ అంత లాభసాటిగా లేనప్పుడు.. జగ్గారెడ్డికి కూడా.. కాంగ్రెసులో చేరిక మేలు చేయవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: