రాజకీయ రంగంలో ఉన్న తరువాత.. ప్రతి పార్టీకి చెందిన నాయకుడూ.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది మేమే అని చెబుతూ ఉంటారు. సినిమా తీసిన ప్రతివాడూ.. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే.. ఇదివరకు ఎన్నడూ రాని కథాంశంతో వచ్చిన సినిమా అని ఎలా ఊదరగొడతారో.. ఎన్నికల్లో పోటీచేసిన ప్రతి నాయకుడూ కూడా.. అదే రీతిగా.. నేనే గెలుస్తా అనే అంటూ ఉంటారు. ఇది సహజం. మరో రకంగా చెప్పాలంటే.. ఇలాంటి భవిష్యత్తు మీది ఆశే.. వారిజీవితానికి ఇంధనంలాగా నడిపిస్తూ ఉంటుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు కూడా అలాంటి ఆశలు చాలా ఉన్నట్లున్నాయి. అయితే.. తమాషా ఏంటంటే.. ఆయన వాటిని బయటపెట్టినప్పుడు.. పసిపిల్లలు కూడా నమ్మడానికి వీల్లేని విధంగా ఆ ఆశలు ఉండడమే చోద్యం. 


ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు ఏడాది తర్వాత తెలంగాణలో తన పార్టీ భవిష్యత్తు సప్త వర్ణాలలో కనిపిస్తున్నట్లుగా ఉంది. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు సహా నేతలంతా క్యూకట్టి తెరాసలో చేరిపోతూ ఉండగా.. ఫిరాయింపుల చట్టంకింద అనర్హత వేటు వేయాలంటూ.. దారుణంగా పోరాడుతున్న ఎర్రబెల్లి.. బహుశా ఇలాంటి ఆశలతోనే ఇదంతా చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఇప్పుడు తెరాసలోకి వలసల గురించి ప్రస్తావిస్తే. .. 'చూస్తూ ఉండండి. ఏడాది తర్వాత తెరాస నుంచి తెలుగుదేశం లోకి వలసలు ప్రారంభం అవుతాయి' అని ఆయన చాలా ఆశగా సెలవిస్తున్నారు. 


బహుశా, ఈలోగా చంద్రబాబు ఏపీ సీఎంగా అభివృద్ధిని 70 ఎంఎంలో చూపిస్తూ ఉంటాడని, అది చూసి తెలంగాణ నేతలు కూడా డంగైపోయి తెదేపాలో చేరిపోతారని ఆయన అంచనా కావచ్చు. కాకపోతే.. అలాంటి నాయకులంతా.. మహా అయితే తెదేపాతో ఒప్పందాలు చేసుకోవచ్చు గానీ.. అధికారం ఇంకా మూడేళ్లు కలిగి ఉన్న తెరాస పార్టీ ని వదలి ఎందుకు వస్తారన్నది మాత్రం మిలియన్‌ డాలర్‌ ప్రశ్నే. అయినా.. ఉన్న వారిని నిలబెట్టుకునే సత్తా లేదు... మా పార్టీనుంచి ఇక తెరాస వైపు కన్నెత్తి చూసే వారు కూడా ఒక్కరైనా లేరు.. అని గట్టిగా చెప్పే తెగువ లేదు. ఏడాది తర్వాత అటునుంచి ఇటు వస్తారంటూ జోస్యం చెప్పడానికి మాత్రం ఆయన సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం సీనియర్‌, దూకుడైన నాయకుల పరంగా తెలుగుదేశానికి ఎర్రబెల్లి దయాకర్‌ ఒక్కరే ఉన్నారు. ఇదే పోకడలున్న మరో నేత రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తన కొడంగల్‌కే పరిమితం అయిపోగా.. పార్టీ ఇమేజిని కాపాడాల్సిన బాధ్యత మొత్తం ఆయన భుజాల మీదనే పడ్డట్లుంది. అందుకే.. ఏడాది తర్వాత మా పార్టీ వైభవం చూడండి అంటూ కేడర్‌లో కూడా ఆశలు రేకెత్తిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: