స్మార్ట్‌ఫోన్లు వారు నిత్యం అందులోనే ఏదో హడావుడిగా పనిచేసుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటారు. ఫోను మాట్లాడకపోయినా.. ఏదో గేమ్స్‌ ఆడుకుంటూ ఫేస్‌బుక్‌ వాడుకుంటూ ఉంటారు. అయితే.. ఇలా కుర్రకారు లేదా పెద్దవాళ్లు కేవలం స్మార్ట్‌ఫోను వాడకంలోనే గడిపేస్తూ ప్రతిరోజూ వెచ్చిస్తున్న సమయం ఎంతో తెలుసా... అక్షరాలా 169 నిమిషాలు. అంటే సుమారుగా మూడు గంటలు. నిజానికి మనం రోజులో ఉద్యోగం, కాలకృత్యాలు తిండి, ఇతర పనులకు పోగా.. ఖాళీగా గడిపే సమయం 3 గంటలు కూడా ఉండదు. కానీ ప్రజలు సగటున 3 గంటలను స్మార్ట్‌ఫోన్లకు అంకితంచేసేస్తున్నారు. 


మామూలు ఫోను ఉంటే.. అందులో కాల్‌ మాట్లాడడం తప్ప మరో పని ఉండదు. అదే సమయంలో స్మార్ట్‌ ఫోను ఉన్నట్లయితే దాని వినియోగంలో ఉండే రకరకాల ఆఫర్లు మనని ఊరిస్తూ ఉంటాయి. దాని మీద ఎక్కువ సమయం వెచ్చించాలని అనిపిస్తూ ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్లు కొనేసి అందులోని అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లను వాడుకోలేక.. కేవలం.. ఆటలాడుకుంటూ గడిపేవారు మనకు అనేకమంది కనిపిస్తారు. అందుకే భారత్‌లో స్మార్ట్‌ఫోన్లు వాడే వారి గురించి ఓ సర్వే జరిగింది. స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌ పెర్‌సోనా రిపోర్ట్‌ పేరిట ఒక నివేదికను వెల్లడించారు. అందులో 12వేల మంది వినియోగదారుల్ని మూడు నెలల పాటూ పరిశీలించి వివరాలు సేకరించారు. సగటు లెక్క తేలిస్తే.. ఒక్కొక్కరు రోజుకు మూడు గంటలు ఫోనులోనే జీవిస్తున్నట్లు తేలిందన్నమాట. ఇలా వాడేవారిని ఈ నివేదిక ఆరు రకాలుగా వర్గీకరించిందిట. 


మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో మీ దినసరి వేతనం లేదా రాబడి ఎంత ఒక్కసారి దయచేసి లెక్కవేసుకోండి. సదరు రాబడికోసం మీరు వెచ్చిస్తున్న సమయం ఎంత? అంటే అంచనాగా గంటకు మీ సంపాదన ఎంతో మీకు లెక్క తేలుతుంది. రోజుకు మూడు గంటలు స్మార్ట్‌ ఫోను మీద గడిపేస్తున్నారంటే.. ఒక్కసారి ఎంత 'విలువైన' సమయం వృథా అవుతున్నదో కూడా లెక్క వేసుకోండి. గుండె గుభేలు మంటుంది. ఇదంతా స్మార్ట్‌ ఫోనును వినియోగించడం కోసం అయ్యే ఇంటర్నెట్‌ డేటా మరియు కాల్‌చార్జీలకు అదనం అన్నమాట. ఉత్తినే పని ఉన్నా లేకపోయినా.. చేతిలో స్మార్ట్‌ ఫోను ఉన్నది కదాని.. దాన్ని కెలుకుతూ టైం వేస్టు చేసుకునే వారు.. అలా వేస్టయ్యే సమయం విలువ తెలుసుకుంటే.. వాడకం కూడా తప్పక తగ్గిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: