ప్రస్తుతం బెయిలు మీద ఉన్న ఓటుకు నోటు కేసు నిందితుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గురువారం నాడు హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. తాను తరచుగా హైదరాబాదు వస్తూ ఉండవలసిన అవసరాన్ని ఆ పిటిషన్‌లో ఆయన నొక్కి వక్కాణిస్తూ.. ఆ మేరకు తన బెయిలు మీద ఉన్న నిబంధనల్ని సడలించాల్సిందిగా.. కోర్టును అభ్యర్థించారు. అయితే ఆయన సదరు పిటిషన్‌లో అన్నీ రాజకీయ కారణాలే చూపించిన నేపథ్యంలో.. దానికి అనుమతి మంజూరు చేయడానికి న్యాయమూర్తి నిరాకరించారు. పాపం బెయిలు వచ్చిన నాటినుంచి కొడంగల్‌నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోయే సరికి ఆయన చిరాకు కలుగుతున్నదేమో.. కాస్త రిలాక్స్‌డ్‌ గా భాగ్యనగరానికి రావాలనుకుంటే.. హైకోర్టు ఆయనకు రెడ్‌సిగ్నల్‌ చూపించింది. 


నిజానికి రేవంత్‌కు బెయిలు లభించిన రోజునే, భవిష్యత్తులో ఇలాంటి పిటిషన్‌ ఒకటి రేవంత్‌ వేస్తారని ఊహాగానాలు నడిచాయి. బెయిలు ఇచ్చినప్పుడు హైకోర్టు ఆయన కొడంగల్‌ నియోజకవర్గం దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని నిబంధనలు విధించింది. అయితే తాజాగా గురువారం నాడు హైకోర్టులో వేసిన పిటిషన్‌లో రేవంత్‌ పలు కారణాలు చూపించారు. తెలుగుదేశంలో తాను సీనియర్‌ నాయకుడినని, రాజధానిలో పార్టీ కార్యక్రమాలకు నేరుగా హాజరుకావాల్సి ఉంటుందని, అందువల్ల బెయిల్‌ షరతులు సడలించాలంటూ ఆయన ఆ పిటిషన్‌లో కోరారు. 


దానిపై ఏసీబీ న్యాయవాదులు అభ్యంతరాలు చెబుతూ.. ఆరోగ్య కారణాలు, కుటుంబ పనుల మీద నగరానికి రావడం పర్లేదు గానీ.. రాజకీయ కారణాల కోసం సడలింపు అడగడం సరికాదని చెప్పారు. ఆయన అలా నగరానికి రావడం మొదలైతే.. దర్యాప్తు ప్రభావితం అవుతుందన్నారు. చివరికి న్యాయమూర్తి ఇలంగో.. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సిందిగా రేవంత్‌ కు సూచించడంతో.. ఆయన గత్యంతరంలేక వెనక్కి తీసుకున్నారు. పాపం.. రేవంత్‌కు భాగ్యనగరంలోకి రావాలన్న కోరికకు న్యాయస్థానం రెడ్‌సిగ్నల్‌ చూపినట్లయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: