ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారంటూ తనను ఎవ్వరూ వేలెత్తి చూపించేందుకు అవకాశం లేకుండా.. మడమ తిప్పని పోరాటం సాగించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి సన్నద్ధం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాష్ట్రంలోని పార్టీలు నాటకాలాడుతున్న నేపథ్యంలో... వారి గాటన ప్రజలు తనను కూడా జమకట్టకుండా ఉండేందుకు ఆయన కేంద్రాన్ని ఢీకొట్టడానికి నిశ్చయించుకున్నారు. ఏకంగా తన పార్టీ తరఫు ఉండే ప్రజాప్రతినిధులు అందరినీ వెంటబెట్టుకు వెళ్లి.. ఢిల్లీలోనే ధర్నాకు కూర్చోవడం ద్వారా ఏపీ కి ప్రత్యేక హోదా అనే అంశంపై యావద్దేశం దృష్టిపడేలా చేయడానికి జగన్మోహనరెడ్డి వ్యూహరచన చేశారు. తన ఉద్యమం ద్వారా మోడీ సర్కారు మెడలు వంచి.. సత్ఫలితం సాధించాలనేది ఆయన ఆశయంగా ఉంది. 


ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడే విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ దాదాపుగా చేతులెత్తేసినట్లే. కేంద్రంలో భాగస్వామి అయిన తెలుగుదేశం.. తమ పార్టీ ప్రయోజనాలకోసం.. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రులు చెబుతున్న మాటలకు బజన చేస్తోందే తప్ప... గట్టిగా మోడీ సర్కారును నిలదీయడం లేదు. అదే సమయంలో విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని పొందు పరచింది తామే అని టముకు వేసుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ కూడా దాన్ని సాధించడం కోసం చేసిందేమీ లేదు. కోటి సంతకాల ఉద్యమం నడుపుతున్నాం అని చెప్పారే తప్ప.. ఎంత రీచ్‌ అయ్యారో తెలియదు. సోనియాను పిలిచి విజయవాడలో సభ పెడతాం.. ఢిల్లీ ఉద్యమిస్తాం అని రఘువీరా ప్రభృతులు చెప్పిన మాటలు తేలిపోయాయి. 


తాజాగా ఇప్పుడు వైకాపా జగన్‌ వంతు వచ్చింది. మోడీ సర్కార్‌ దిగివచ్చే వరకు తమ పోరాటం ఉంటుందని జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఢిల్లీలో దీక్ష చేయడానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేయాలని నిర్ణయించారు. ఏపీలోని పార్టీ ఎమ్మెల్యేలు 67 మంది, అందరు ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడ ఈ దీక్షలో పాల్గొంటారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు 5 గంటల పాటు మాత్రమే ఈ దీక్ష జరుగుతుంది. ఆ తర్వాత మార్చ్‌ టూ పార్లమెంట్‌ నిర్వహిస్తారు. 


అయితే జగన్‌ ఇక్కడ కీలకంగా గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ఆయన ఆ ఒక్కరోజున అదికూడా కేవలం 5 గంటలపాటూ ఢిల్లీలో ఒక దీక్ష జరిపి, నినాదాలు చేసినంత మాత్రాన ప్రత్యేక హోదా వచ్చేస్తుందనుకుంటే భ్రమే. మోడీ సర్కారు దిగివచ్చే వరకు పోరాటం ఉంటుందన్న తన మాటను ఆయన గుర్తుంచుకోవాలి. కేంద్రంతో పోరాటాన్ని నిరంతరాయంగా కొనసాగించాలి. లేకపోతే... తన కేసుల కోసం మోడీ వద్ద సాగిలపడిపోయిన జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తున్నాడన్న ప్రతిపక్షాల మాటలను ఆయనే స్వయంగా నిజం చేసినట్లు అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: