తెలంగాణ భారతీయ జనతా పార్టీకి నిజానికి ఇవాళ ఒక దెబ్బ పడింది. అంతో ఇంతో ప్రజల్లో తనకంటూ సొంత బలం కూడా కలిగి ఉన్న నాయకుడు.. తూర్పు జయప్రకాష్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెసులో చేరిపోయారు. తొలుత ఆరెస్సెస్‌ కార్యకర్తగానే తన జీవితాన్ని ప్రారంభించి.. భాజపా తరఫునే మునిసిపల్‌ ఛైర్మన్‌ కూడా అయిన జగ్గారెడ్డి.. మధ్యలో కాంగ్రెసులోకి వెళ్లినా.. మెదక్‌ ఉప ఎన్నిక సమయంలో తిరిగి బీజేపీలో చేరారు. తీరా ఇప్పడు భాజపాలో చేరడమే పొరబాటు అని ప్రకటించి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. 


జగ్గన్న సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఈయన తిరిగి వెళ్లిపోయిన నేపథ్యంలో తెలంగాణ భాజపా నాయకత్వం మీద మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి. పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీల నాయకుల్ని కలుపుకుపోవడంలో ఇక్కడ బాగా పాతుకుపోయిన నాయకులు విముఖంగా ఉన్నారని, వారితో పొసగనివ్వకుండా.. వారికి పొమ్మనకుండా పొగపెట్టే పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెభాజపా కాస్త బలపడుతున్నట్లే కనిపించింది. తెదేపానుంచి నాగం జనార్దనరెడ్డి, మరో నాయకుడు యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు వచ్చి అందులో చేరారు. అలాంటి నేతల్ని సరిగ్గా వాడుకుంటే.. పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని అంచనాలు వేశారు. ఆ ఎన్నికల్లో పెద్దగా రిజల్టు కనిపించలేదు. ఆ తరవాత జగ్గారెడ్డి కూడా వచ్చారు. అయితే ఈ ముగ్గురు నేతలను కూడా.. పార్టీలో పాత నాయకులు కలుపుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు లేవు. 


వీరందరూ వస్తే.. పార్టీలో తమ గుత్తాధిపత్యం దెబ్బతింటుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. అలాంటి నేతల వైఖరితో విసిగిపోయిన కొత్తగా వచ్చిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీలోకి వచ్చిన వారిని భాజపా దూరం చేసుకుంటున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఇవాళ జగ్గారెడ్డి వెళ్లిపోయారు. నాగం తెదేపాలోకి మళ్లీ వెళ్లిపోతారనే పుకార్లు ఎప్పటినుంచో ఉన్నాయి. అలాగే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడ పార్టీని వదులుతారని, పార్టీని పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు. ఇలా.. స్థానిక భాజపా నేతల వైఖరి.. ఒకవైపు కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో ఏమాత్రం బలపడకుండా చేసేస్తున్నదని పలువురు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: