రాజకీయాల్లో ఒక్కో నాయకుడిది ఒక్కో స్టైల్ ఉంటుంది. అలాగే పార్టీలకు కూడా.. కాకపోతే.. ఇప్పుడు రాజకీయ నాయకులు తెలివిమీరారు.. ఒకరిని చూసి మరొకరు బాగా నేర్చుకుంటున్నారు. మంచి ఎక్కడ ఉన్నా.. దాన్ని అనుసరించి నేర్చుకుంటే ఇబ్బంది లేదు కానీ.. మన దురదృష్టం కొద్దీ ఇలా నేర్చుకుంటున్నవన్నీ మరొకరిని ఇరుకున పెట్టాలనే రాజకీయాలే. 
 
ఆంధ్రా- తెలంగాణ.. ఎవరికి వారే విడిపోయాయి.. స్వతంత్ర్యంగా పాలన సాగించుకుంటున్నాయి. కానీ ఈ రెండు రాష్ట్రాల పాలకులు ఒకరి ప్రస్తావన లేకుండా మరొకరు రాజకీయ ప్రసంగాలు చేయడం అలవాటు చేసుకోనేలేదు. విడిపోయి ఏడాది దాటిపోయినా..ఇంకా తమ రాష్ట్ర కష్ఠాలకు పొరుగు రాష్ట్రాలే కారణం అనడం మానడం లేదు. గతంలో ఈ డైలాగ్ ఎక్కువగా కేసీఆర్ పేల్చేవారు. తెలంగాణలో ఏ సమస్య ఉన్నా.. అది సమైక్యపాలకుల వల్లే వచ్చిందనేవారు. 

ప్రత్యేకించి కరెంటు సమస్య, జల వివాదాలు, ఉద్యోగుల విభజన వంటి విషయాల్లో కేసీఆర్ ఎక్కువగా ఈ డైలాగ్ వాడేవారు. పొరుగున ఉన్న చంద్రబాబు ప్రతి తెలంగాణ విషయంలో వేలు పెడుతూ అడ్డుపడుతున్నాడని విరుచుకుపడేవారు. ఇప్పుడు కేసీఆర్ ను చూసి తెలుగుదేశం మంత్రులు కూడా సేమ్ రూట్ ఫాలో అయిపోతున్నారు. ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడులు రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని లేటెస్టుగా ఆంధ్రా మంత్రి రావెల కిషోర్ బాబు కామెంట్ చేశారు. 

ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని కేసీఆర్ ప్రభుత్వం రకరకాల రూపాలలో అడ్డుకుంటోందట. ఆంధ్రాలో పరిస్థితి అంతగా బాగోలేదని.. పెట్టుబడిదారులకు నూరిపోస్తూ నిరుత్సాహపరుస్తున్నారట. ఐతే.. తన ఆరోపణలకు ఆధారాలు కూడా చూపిస్తానంటున్నారు మంత్రి రావెల కిషోర్ బాబు. కొన్ని కంపెనీల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం పంపిణ ఈ మెయిళ్లు తమ వద్ద ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ఆధారాలు ఉన్నప్పుడు మరి ఏకంగా వాటిని బయటపెట్టి ఆరోపణ చేస్తే ఓ పనైపోతుంది కదా.. ఒకవేళ రావెల చెప్పిందే నిజమైతే.. తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు పీతల కథను తలపిస్తున్నట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: