మనదేశంలో న్యాయవ్యవస్థ.. ఎంతగా అందుబాటులో ఉంటుందో తెలియజెప్పే సంఘటన ఇది. న్యాయవ్యవస్థను ఆశ్రయించదలచుకుంటే.. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా.. వ్యవస్థ నిత్యం సామాన్యుడికి, ప్రతి నేరస్తుడికి అందుబాటులోనే ఉంటుంది అని నిరూపించే సంఘటన. ఇంత ప్రజాస్వామికంగా వ్యవహరించే దేశాలు అసలు ఎన్ని ఉంటాయో ఏమో మనకు తెలియదు గానీ.., మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్టు తలుపులు అర్ధరాత్రి తెరచుకున్నాయి. యాకూబ్‌ మెమన్‌ ఉరితీయడానికి కొన్ని గంటల ముందే.. ఆయన న్యాయవాదులు కొత్తగా సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ వేయదలచుకోవడంతో... న్యాయమూర్తులు.. ఇలా అర్ధరాత్రి అద్భుతంగా స్పందించారు. 


యాకూబ్‌ మెమన్‌ తరఫు న్యాయవాదులు.. ఎలాగైనా సరే.. ఉరిని వాయిదా వేయించాలని పట్టుదలగా అనుకున్నారు. ఉరిని క్షమాభిక్షగా మార్చడానికి వారి ప్రయత్నాలు వారుచేసి.. 29న సాయంత్రం వరకు అదే ప్రయత్నాల్లో ఉండి విఫలం అయిన సంగతి తెలిసిందే. అయితే.. చివరిరోజున మళ్లీ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్‌ పెట్టి.. నిరీక్షించారు. రాత్రి పది వరకు కూడా అటునుంచి సమాచారం లేదు. దీంతో.. రాష్ట్రపతి నుంచి సమాధానం రాలేదు గనుక.. అది వచ్చే వరకు ఉరిని వాయిదా వేయాలనే కొత్తడిమాండ్‌తో సుప్రీంలో కేసు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వారు ఆ పనిచేసేలోగా రాష్ట్రపతి నిర్ణయం వచ్చేసింది. 


ఆ వెంటనే వారు 'ప్లాన్‌ బి' కి వెళ్లిపోయారు. లక్ష్యం ఒకటే.. ఉరిని ఆపుచేయించడం.. అనగా వాయిదా వేయించడం. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించి, అరగంట కూడా గడవక ముందే.. తమ 'ప్లాన్‌ బి'లో భాగంగా యాకూబ్‌ న్యాయవాదులు రాత్రి 11.10 గంటలకు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ హెచ్‌ ఎల్‌ దత్‌ ను ఇంటిలో కలిశారు. ఇది చాలా అసాధారణమైన చర్య అనుకోవాలి. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ మీద అప్పీలు చేసుకోవడానికి కనీసం 14 రోజుల వ్యవధిలేకుండా నిర్ణయం రావడం కుదరదంటూ కొత్త లిటిగేషను పెట్టారు. 
అక్కడే మన భారతీయ న్యాయవ్యవస్థకు మనం సలాం చేయాలి. ఆ పిటిషన్‌ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి అడ్మిట్‌ చేసుకున్నారు. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో అప్పటికప్పుడు ఒక బెంచ్‌ ఏర్పాటుచేసి.. విచారించమని చెప్పారు. 


అర్ధరాత్రి ఒంటిగంటకు ఉరుకులు పరుగుల మీద న్యాయమూర్తులందరికీ సమాచారం ఇచ్చిన తరువాత.. అందరూ సుప్రీం కోర్టుకు పరుగులు పెట్టారు. మీడియా కూడా పోగైంది. తమాషా ఏంటంటే.. ఉరికి వ్యతిరేకంగా ఉన్న వారు ఆ సమయంలో కూడా విచారణ సంగతి ముందే తెలుసన్నట్లుగా సుప్రీం వద్ద ప్లకార్డులు పట్టుకుని.. నినాదాలు చేయడం. న్యాయమూర్తులందరూ వచ్చాక.. అర్ధరాత్రి 2 గంటలకు సుప్రీం కోర్టు తలుపులు తెరచి.. 3.20కి వాదనలు వినడం ప్రారంభించారు. 90 నిమిషాల పాటూ ఈ పర్వం నడిచింది. అంతా పూర్తయిన తర్వాత.. 4.50 గంటలకు తీర్పు వచ్చింది. మెమన్‌ తరఫు న్యాయవాదుల అభ్యర్థనను తిరస్కరించారు. పర్యవసానంగా ఉరి అమలు జరిగింది. 


సెలవులు, రాత్రి వేళల్లో న్యాయమూర్తులు అవసరాన్ని బట్టి పనిచేయడం కొత్త కాదు. ఏమైనా అరెస్టులు జరిగితే రిమాండులు ఇవ్వడం వరకు మాత్రమే.. ఇలాంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ, మన న్యాయవ్యవస్థ ఔన్నత్యం ఏంటంటే.. రాష్ట్రపతి తిరస్కరించిన తర్వాత.. దాని గురించి విచారించడానికి.. కొన్ని గంటల ముందే తాము కూడా తిరస్కరించిన సుప్రీం న్యాయపీఠం మళ్లీ కొలువుతీరడం. అందుకే మన వ్యవస్థలోని పారదర్శకతకు, అంకిత భావానికి మనం గర్వించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: