ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కుతుందా లేదా అనే విషయంలో ఆశలు దోబూచులాడుతూ వచ్చాయి. అయితే కేంద్రం మాత్రం ఈ ఆశలపై పూర్తిగా నీళ్లు చిలకరించేసింది. అనాథలాగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అండగా నిలబడవలసిన ప్రభుత్వం.. విభజన చట్టంలో ఉన్న వెసులుబాటును కూడా కల్పించడానికి ఇప్పుడు 'తూచ్‌' అనేస్తోంది. కేంద్రమంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ ఈ హోదా విషయంలో పార్లమెంటులో మాట్లాడుతూ... ఏపీకి హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చేశారు. ఇది నిరీక్షిస్తున్న ప్రజలకు అశనిపాతం అని చెప్పాలి. 


నరేంద్రమోడీ.. ముఖ్యమంత్రిగా ఒక తీరుగా, ప్రధానమంత్రిగా ఒక తీరుగా పనిచేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రచారానికి వచ్చినప్పుడు అనాథరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని స్వయంగా అంటూ.. ఎన్నెన్ని వరాలుగుప్పించారో ప్రజలకు గుర్తుకొస్తున్నాయి. గెలిచిన తర్వాత నుంచి అందరూ ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించినప్పుడెల్లా నాటకాలు ఆడుతున్నారు. 


ఏపీనుంచి వెంకయ్యనాయుడు లాంటి సీనియర్‌ మంత్రి ఉన్నారు.. కేంద్ర వ్యవహారాల్లో చక్రంతిప్పే నిర్మలా సీతారామన్‌ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కేంద్రానికి వత్తాసు పలుకుతుంటారు. కానీ వీరెవ్వరూ కూడా ఏపీ ప్రయోజనాల కోసం చట్టంలోని హోదాను సాధించలేకపోతున్నారు. చట్టంలో ఉన్నదాన్నేసాధించలేని వారు.. కేంద్రంనుంచి కొత్తగా ఇంకేం సాధించగలరు అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. 


తాజాగా పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రమంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. కొత్తగా దేశంలోని ఏ రాష్ట్రానికి కూడా.. ప్రత్యేకహోదా ఇవ్వబోయేది లేదని, అసాధ్యం అని చెప్పారు. బీహార్‌ కు కూడ ప్యాకేజీ మాత్రమే ఇచ్చామని హోదా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇటీవలే ఈ హోదా విషయంలో పోరాడలేకపోతున్న తెలుగుదేశం ఎంపీలకు సిగ్గులేదా అని హీరో పవన్‌కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌లో అడిగిన సంగతి తెలిసిందే. రాహుల్‌గాంధీ కూడా తన టూర్‌లో ఇదే నిలదీశారు. ఆ తర్వాత జగన్‌ ఆగస్టు 10న జంతర్‌మంతర్‌ వద్ద 5 గంటల ధర్నా చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం చాలా నిష్కర్షగా.. ప్రత్యేకహోదా ఇచ్చే సమస్యే లేదని చెప్పేయడంపై ఆంధ్రులు హతాశులవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: