యాకూబ్‌ మెమన్‌ ఉరితీత పూర్తయింది. నిన్నటివరకు సానుభూతితో అతడి ఉరిశిక్ష రద్దుకోసం క్షమాభిక్ష కోసం స్పందించిన వారంతా ఇప్పుడిక సైలెంట్‌ అయిపోయారు. కానీ అదే మెమన్‌కు మద్దతుగా.. మరో వర్గం ఇప్పుడే మేలుకుంటోంది. ఉరితీయడంపై బుసలు కొడుతోంది. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటోంది. దీనికి ప్రతీకారంగా భారత్‌లో దాడులు నిర్వహిస్తాం అని హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలు మాఫియానుంచి వస్తుండడం విశేషం. ఇప్పటిదాకా మొన్న ఉరితీసిన యాకూబ్‌ మెమన్‌కు కేవలం ఉగ్రవాద సంబంధాలు మాత్రమే ఉన్నాయని అంతా అనుకున్నారు.. అయితే.. అతనికి మాఫియాతో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయా అని అనుమానాలు కలిగేలా.. తాజా పరిణామాలు, హెచ్చరికలు ధ్వనిస్తున్నాయి. 
యాకూబ్‌ మెమన్‌ ను ఉరితీసేస్తే.. దేశంలో అక్కడక్కడా చెదురుమదురుగా అల్లర్లు జరగవచ్చునని ప్రభుత్వాలు భావించాయి. దేశమంతటా కూడా హైఅలర్ట్‌ విధించారు. ప్రత్యేకించి విమానాశ్రయాల్లో తనిఖీలు పెంచారు. గొడవలు జరుగుతాయని అనుకున్నారు. కానీ అంతా ప్రశాంతంగానే ముగిసిపోయింది. 


ఇవాళ మాఫియా డాన్‌ ఛోటా షకీల్‌ ఈ ఉరితీతపై తీవ్రస్థాయిలో స్పందించాడు. దీన్ని ప్రభుత్వం చేసిన హత్యగా షకీల్‌ అభివర్ణించాడు. భారత ప్రభుత్వాన్ని నమ్మి లొంగిపోయినందుకు, అతణ్ని వంచించి ఈ శిక్ష విధించారని షకీల్‌ అభివర్ణించాడు. సోదరుడు టైగర్‌ మెమన్‌ చేసిన నేరానికి, యాకూబ్‌ శిక్ష అనుభవించాల్సి వచ్చిందంటూ సానుభూతి వ్యక్తం చేశాడు. 
లొంగిపోతే, విచారణకు సహకరిస్తే.. శిక్ష తగ్గేలాచూస్తామని ప్రలోభ పెట్టిన భారత్‌ ప్రభుత్వం , ఇప్పుడిలా ఉరితీసి హత్యచేసిందనేది ఛోటా షకీల్‌ ఆరోపణ. దావూద్‌ ఇబ్రహీం కు కూడా ఇలాంటి ఆశలు చూపించారని, ఆయన లొంగిపోయినా కూడ ఇదే పరిస్థితి ఉండేదని షకీల్‌ అన్నాడు. భారత ఏజన్సీలు ఇచ్చే చాక్లెట్‌ లను, ప్రలోభాలు ఇప్పుడెవరూ నమ్మరని చెప్పిన షకీల్‌.. దావూద్‌తో యాకూబ్‌ మెమన్‌కు ఎలాంటి సంబంధాలు లేవని సర్టిఫికెట్‌ కూడా ఇవ్వడం విశేషం. 


అయితే ఇదంతా ఒక ఎత్తు.. ఇప్పటిదాకా మెమన్‌ పట్ల సానుభూతి చూపించిన వాళ్లంతా.. ఉరితీయకుండా శిక్ష మార్చమని కోరారు. అలాగే.. ముస్లిం గనుక ఉరితీస్తున్నారని కూడా ఒవైసీ లాంటి కొందరు దూకుడైన విమర్శలు చేశారు. కానీ వీళ్లంతా ఎంతో బెటర్‌ అనిపిస్తోంది. చివరికి ఒవైసీ కూడా.. ఉరి తర్వాత.. ఈ నిర్ణయం బాధాకరం అన్నారే తప్ప.. తీవ్రంగా ప్రతిస్పందించలేదు. కానీ ఛోటా షకీల్‌... మెమన్‌ ఉరితీతకు ప్రతీకారం తీర్చుకుంటాం.. భారత్‌పై దాడులు చేస్తాం అంటూ.. మెమన్‌ మీద కొందరు ప్రజల్లో ఉన్న సానుభూతిని కూడా కాలరాచేస్తున్నట్లు కనిపిస్తోంది. మెమన్‌కు ఉగ్రవాదుల్తోనే కాకుండా, మాఫియాతో కూడా సంబంధాలున్నాయా అనే అనుమానాలు కలిగేలా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: