తెలంగాణ భాజపాలో ఇప్పుడు సమరోత్సాహం కనిపిస్తోంది. తెరాస సర్కారు గద్దె ఎక్కిన నాటినుంచి అడపాదడపా ప్రకటనలు గుప్పించడం తప్ప నిస్తేజంగానే పనిచేస్తున్న ఈ పార్టీ.. ప్రస్తుతం వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నిక ఒకవైపు, మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మోహరించి ఉండడంతో.. తిరిగి ఉత్సాహాన్ని పుంజుకునే ప్రయత్నంలో ఉంది. జగ్గారెడ్డి లాంటి వాళ్లు వెళ్లిపోయినా, నాగం లాంటి వాళ్లు పార్టీకి అంటీఅంటనట్లు ఉన్నా.. పార్టీలో పాతుకుపోయిన పాతకాపులు తమ పని తాము చేసుకుపోతున్నారు. తమ పాతస్టయిల్లోనే ఎన్నికలకు సిద్ధం అయిపోతున్నారు. 


వరంగల్‌లో ఈసారి ఎవరు పోటీచేయాలనే విషయంలో తెదేపా భాజపా మధ్య ఒప్పందం కుదిరినట్లు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు గానీ.. భాజపా సన్నాహాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటు జీహెచ్‌ఎంసీ మీద మాత్రం స్ట్రాంగుగానే కన్నేస్తోంది. జీహెచ్‌ఎంసీలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలు ఏర్పాటుచేసి.. ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
అయితే తమకు ఉన్న బలాన్ని నమ్ముకోవడమే కాకుండా.. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రచారం చేయడం ద్వారా నగరవాసుల ఓట్లను తమవైపు ఆకర్షించుకోవాలని భాజపా ప్రయత్నిస్తున్నది. నగరంలో ఆధార్‌ కార్డుకు, ఓటు హక్కు కు లింకుపెట్టి 15 లక్షల ఓట్లను తొలగించాలని కేసీఆర్‌ ప్రకటించారు. ఈ తొలగింపు అనేది చట్టబద్ధంగా సాధ్యం అయ్యేలా మాత్రం కనిపించడం లేదు. తాజాగా కూడా సుప్రీం కోర్టు ఆధార్‌తో లింకులు పెట్టరాదని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో.. ఎటూ ఓట్లు పోవు గనుక.. అలా లింకు పెట్టదలచుకన్ను ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, ఓట్లు తొలగించాలనే ఆలోచనకు వ్యతిరేకంగా తాము పోరాడినట్లుగా కనిపిస్తే.. లాభం ఉంటుదని భాజపా భావిస్తున్నది. 


ఓటుకు, ఆధార్‌కు లింకు పెడితే సహించం.. కోర్టుకు వెళ్తాం.. అని ఇప్పటికే కిషన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాపోరాటాలకు కూడా సిద్ధం అంటున్నారు. నిజానికి అది ముగిసిపోయిన అంశమే గానీ.. ప్రభుత్వాన్ని బద్‌నాం చేస్తూ.. ఆ వర్గం ప్రజల్లో కాస్త క్రేజ్‌ సంపాదించుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని భాజపా అంచనాగా ఉంది. ఏదో ఒకలాగా ఆధార్‌పై పోరాటం సల్పి.. ఫలితాన్ని ఓట్లరూపంలోకి మార్చుకోవాలని వారు ఆరాటపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: