ప్రత్యేక హోదాపై క్లారిటీ వచ్చేసింది. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది. కానీ మొదటి నుంచి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఊరిస్తూ వచ్చిన పసుపు దళం మాత్రం ఇంకా పాతపాటే పాడుతోంది. కేంద్రం ప్రకటనతో షాక్ కు గురయిన టీడీపీ.. ఇప్పుడు జనానికి ఎలా సర్దిచెప్పాలా అనే అంశంపై దారులు వెదుక్కునే ప్రయత్నం చేస్తోంది. హోదా వచ్చినా రాకపోయినా తాము పోరాడూనే ఉన్నామనే బిల్డప్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

పాపం.. ఇటీవల ఆంధ్రా సీఎం చంద్రబాబుకు అన్నీ వరసగా చిక్కులే వస్తున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి చిరాకు పెడుతున్నాయి. ఇప్పుడీ హోదా ప్రకటన. ప్రత్యేక హోదా తెచ్చుకోలేనప్పుడు, ప్రత్యేకంగా నిధులు రప్పించుకోలేకపోయినప్పుడు.. మీరు ఇంకా ఎందుకు మోడీ సర్కారులో కొనసాగుతున్నారన్న విమర్శలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పోనీ అలాగని మోడీ సర్కారుతో తెగతెంపులు చేసుకుందామన్నా.. దాని వల్ల టీడీపీకి నష్టమే కానీ లాభం లేదు. 

హోదాపై కేంద్రం ప్రకటన వచ్చిన సమయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. అందులో ఈ విషయం కూడా చర్చకు వచ్చింది. ఐతే.. మంత్రి ప్రకటనలో ఏపీ ప్రస్తావన లేదని.. ఆంధ్రాకు హోదా ఇస్తామని కానీ ఇవ్వబోమని కానీ ఎక్కడా చెప్పలేదని యనమల రామకృష్ణుడు వంటి సీనియర్లు లా పాయింట్ లాగే ప్రయత్నం చేశారు. కేంద్రం అంత క్లియర్ గా చెప్పేశాక.. ఇంకా ఈ తర్కం పనికొస్తుందా.. 

ఈ హోదా ప్రకటన కారణంగా రాష్ట్ర టీడీపీ-బీజేపీలపై ఒత్తిడి పెరగడం ఖాయం. విపక్షాలు జోరు పెంచడం ఖాయం. జనం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవడం ఖాయం. ఐతే.. కేంద్రంతో చాలా విషయాల్లో అవసరం ఉంటుంది కాబట్టి.. ఈ విషయంలో దూకుడుగా కాకుండా సానుకూలంగానే వెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. ప్రత్యక హోదా ప్రజల కోరిక.. దానిపై మనం డిమాండ్ చేస్తూనే ఉందాం.. ఇస్తారనే ఆశిద్దాం.. అంటున్నారు. అంటే ప్రస్తుతానికి వెయిట్ అండ్ సీ పాలసీ అన్నమాట. కానీ ఈలోపు ఈ అంశాన్ని వైసీపీ హైజాక్ చేసి ఉద్యమాలు గట్రా సీరియస్ గా చేస్తే.. బాబుకు పొలిటికల్ గా నష్టం తప్పదంటున్నారు విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: