వై.ఎస్.జగన్.. చిన్నవయసులోనే ఓ రాజకీయ పార్టీ స్థాపించుకున్నాడు. రాష్ట్రంలో ప్రతిపక్షనేతగా ఉన్నాడు. కానీ ఆయన వ్యవహారశైలి గురించి రకరకాల వాదనలు వినిపిస్తాయి. ప్రధానంగా ఆయన దూకుడు స్వభావి అని.. ఆయనకు అహం ఎక్కువనీ పుకార్లు ఉన్నాయి. వయసులో ఎంతటి పెద్ద నాయకులైనా..జగన్ ను సార్ అనాల్సిందేనని... ఆయన కనీస గౌరవం కూడా ఇవ్వరని.. ఆ పార్టీ నుంచి బయటపడినవారు చెప్పారు. 

అంతేకాదు.. పార్టీ వ్యూహాలు డిసైడ్ చేసే సమయంలోనూ అంతా వన్ వే వ్యవహారమే సాగుతుందని ఓ టాక్.. తాను చెప్పాల్సింది.. చేయాలనుకున్నది చెప్పడమే తప్ప.. ఆయన ఎప్పుడూ ఎవరి సలహాలు వినరని చెబుతారు. ఈ తలబిరుసు వ్యవహారంతోనే అనుభవం లేని నిర్ణయాలు తీసుకుని..రాజకీయంగా దెబ్బతిన్నారని కూడా అంటారు. ఐతే.. లేటెస్టుగా జగన్ వైఖరిలో చాలా మార్పు వచ్చిందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.    

తంలో జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుని , దాన్ని ఎలా అమలు చేయాలన్నదానిపై మాట్లాడేవారట. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ముందే ఆ నిర్ణయంపై పార్టీ నాయకులతో చర్చిస్తున్నారట. వారి అభిప్రాయాలు తెలుసుకుని తన వ్యూహంలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారట. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోనూ అదే జరిగిందట. ప్రత్యేక హోదా పై ఎలాంటి ఆందోళన చేయాలి? అలాగే ఆయా అంశాలపై పార్టీ రాజకీయ పంథా ఎలా ఉండాలి? పార్టీ విధానాలలో ఏమైనా మార్పు అవసరమా? అని జగన్ నాయకులను పదే పదే అడిగారట. 

కేవలం పార్టీ వ్యూహం విషయంలోనే కాదు.. తన విషయంలోనూ ఏమైనా మార్పులు అవసరమైతే చెప్పాలని పార్టీ నాయకులను అడిగారట. చెప్పడమే తప్ప వినడం అలవాటు లేని నేత అలా అడిగేసరికి తెల్లబోవడం నాయకుల వంతైందట. జగన్ లో ఈ మార్పు చూసి పార్టీ నాయకులు సంతోషపడుతున్నారట. గతంలో రాజకీయ వ్యూహంలో ఏమైనా పొరపాట్లున్నా తాము నోరుమెదిపేవారం కాదని.. ఇప్పుడు తమ అభిప్రాయం చెప్పే అవకాశం దక్కిందని సంతోషపడుతున్నారట. జగన్ లో ఈ మార్పు మంచిదే కదా..


మరింత సమాచారం తెలుసుకోండి: