కేసీఆర్ పాలనపై జనం చాలానే ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు లక్షల ఉద్యోగాలు వస్తాయని కలలు కన్నారు. ఆంధ్రోళ్లు మన నీళ్లు, ఉద్యోగాలు దోచుకున్నారని ప్రచారం చేయడం ద్వారా.. విడిపోతే ఆ ఉద్యోగాలన్నీ మనకే దక్కుతాయన్న ప్రచారం జరిగింది. ఐతే.. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీన్ డిఫరెంట్ గా ఉంది. ఐతే.. కాస్త ఆలస్యంగానైనా కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టడం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాలి. 

కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల తెలంగాణ ఉద్యోగాల భర్తీ విధివిధానాలను ప్రకటించింది. గ్రూప్ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో ముఖ్యంగా గ్రూప్ 2 ఉద్యోగాల విషయంలో చేసిన మార్పులు వివాదాస్పదమవుతున్నాయి. గతంలో గ్రూప్ 1 ఉద్యోగాలు మినహా ఏ ఇతర ఉద్యోగాలకూ ఇంటర్వ్యూలు ఉండేవి కావు. కేవలం రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే నియామకాలు జరిగేవి. 

ఇంటర్వ్యూలు లేకపోవడం వల్ల.. ప్రతిభావంతులకే ఉద్యోగాలు దక్కేవి. ఓఎంఆర్ షీట్ల ద్వారా గణన ద్వారా పరీక్షలు పారదర్శకంగా జరిగి.. నియామకాలు కూడా లంచాలకు తావు లేకుండా ఉండేవి. రాతపరీక్షల్లో అవకతవకలు జరిగితే తప్ప.. అక్రమాలకు తావుండేది కాదు. ఈ విధానం వచ్చిన తర్వాత.. ప్రభుత్వ ఉద్యోగాల్లో లంచాలు లేకుండానే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కలిగింది. దీంతో పోటీపరీక్షల వైపు మొగ్గుచూపే వారి సంఖ్య కూడా పెరిగింది. 

తాజాగా చేసిన మార్పుల్లో గ్రూప్ 2 ఉద్యోగాలకూ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 675 మార్క్లుల్లో ఇంటర్వూకు 75 మార్కులు ఇచ్చారు. పోటీ పరీక్షల్లో ఒక్క మార్కుతోనే జాతకాలు మారిపోతాయి. అలాంటిది 75 మార్కులు ఇంటర్వ్యూలకు ఇవ్వడమంటే... ప్రతిభావంతులు నోట్లో మట్టి కొట్టినట్టే. ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నవారు అవకతవకలకు పాల్పడే ప్రమాదం ఉందన్న సంగతి గత అనుభవాల ద్వారా తెలిసిందే. ఐతే.. ఇంటర్వ్యూలను వీడియో రికార్డింగ్ చేయడం, ఇంటర్యూకు ఇచ్చిన 75 మార్కులు ఏ అంశాలపై ఎన్ని వేస్తారన్న అవగాహన కల్పించడం.. ఇంటర్వ్యూ మార్కులు పారదర్శకంగా తెలిసేలా చేయడం వంటి చర్యల ద్వారా అక్రమాలకు కాస్త అడ్డుకట్ట వేయవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: