జనం నాడి సరిగ్గా గుర్తించగలిగిన వారికే ఏరంగంలోనైనా సక్సెస్‌ ఉంటుంది. ముఖ్యంగా ప్రజలతో సంబంధం ఉండే రాజకీయాలు, సినిమా, మీడియా వంటి రంగాలకు ఇలా జనం నాడిని పసిగట్టగల జ్ఞానం చాలా ముఖ్యం. ఆయా రంగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లిన వారంతా.. జనం నాడిని సరిగ్గా అంచనా వేయగలిగిన వారే.. కాకపోతే.. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టయిల్‌ ఉంటుంది. చంద్రబాబునాయుడు సర్వేల మీద డిపెండ్‌ అయితే.. కేసీఆర్‌ తనకు నమ్మకస్తులైన వారినే చారులుగా నియమించుకుంటుండవచ్చు. అయితే హైదరాబాదు నగరానికి అతిథిగా వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌.. జనం నాడి పసిగట్టడంలో తనకంటూ ఒక సొంత స్టయిల్‌ మరియు టెక్నిక్‌ ఉన్నదని నిరూపించుకున్నారు. 


ఆయన హైదరాబాదుకు రాగానే ముందు చేసిన పని ఏంటో తెలుసా.. తను ఎక్కిన కారు డ్రైవర్‌ను నగరంలో విద్యుత్తు సమస్య సంగతి ఎలా ఉన్నదని ఆరా తీశారుట. ఈ విషయం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత.. విపరీతమైన విద్యుత్తు సమస్యల్లో ఉన్నదనే సంగతి ఆయనకు తెలుసు. ఇక్కడి సీఎం కేసీఆర్‌ తన వద్దకు వచ్చి విద్యుత్తు సరఫరా గురించి చేసుకున్న ఒప్పందాలు ఆయనకు గుర్తున్నాయి. మరి తమ విద్యుత్తు ఇవ్వడానికి ఇంకా లైన్లే కాలేదు కదా.. ఈలోగా ఆ సమస్యను ఎలా భరిస్తున్నారో అనే ఉద్దేశం ఆయనకు ఉండవచ్చు. అందుకే కారు ఎక్కగానే డ్రైవరును ఆ ప్రశ్న అడిగారు. అందుకు ఆ డ్రైవర్‌ ''కేసీఆర్‌ సీఎం అయ్యాక ఆ కష్టాలే లేవ''ని సమాధానం ఇచ్చార్ట. ఆ ఒక్క ప్రశ్నతోనే రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన ఎలా సాగుతున్నదో తనకు అర్థమైపోయినట్లుగా రమణ్‌సింగ్‌ కేసీఆర్‌ను అభినందించారు. విద్యుత్తు కష్టాలను మీరు చాలా త్వరగా అధిగమించారు... అంటూ ప్రశంసించారు. 


ఆ తర్వాత.. రమణ్‌సింగ్‌ - కేసీఆర్‌తో సమావేశమై విద్యుత్తు ప్రాజెక్టులు, ఇరు రాష్ట్రాల మధ్య ఇతర సంబంధాల గురించి కూడా చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తులైన్లు త్వరగా వేయాలని కోరుకున్నారు. ఇదంతా మామూలే అయినా.. కామన్‌ మ్యాన్‌ను అడిగినప్పుడే.. ప్రభుత్వం గురించిన అసలు పల్స్‌ తెలుస్తుందనే ఆలోచనతో.. హైదరాబాద్‌ రాగానే కారుడ్రైవర్‌ను అడిగిన రమణ్‌సింగ్‌ టెక్నిక్‌ను మన నేతలు నేర్చుకోవాలి. అభిప్రాయ సేకరణ అనగానే స్టార్‌ హోటళ్లలో మీటింగులు, కార్పొరేట్‌ సంస్థలతో సర్వేలు చేయించడం కాదని.. రాండమ్‌గా.. జనం గుండె తలుపు తట్టి వివరాలు తెలుసుకోవడం అని వారు గ్రహించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: