సంచలన ప్రకటనలు చేయడంలో ఎవరైనా సరే.. అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి తర్వాతే. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో బర్నింగ్‌ టాపిక్‌ గా ఉన్న ప్రత్యేకహోదా గురించి అంతకంటె సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా రాదని, ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు చెబుతున్న మాటలన్నీ బుకాయింపులేనని జేసీ వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది. 


ప్రత్యేకహోదా అనేదే ఒక బ్రహ్మపదార్థం అన్నట్లుగా జేసీ తూర్పారపట్టారు. హోదా అంటే ఏమిటో నాకు కూడా తెలియదు. కాకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రంనుంచి మెరుగైన ప్యాకేజీ సాధించడం ఒక్కటే లక్ష్యంగా మేమందరం ప్రయత్నం చేస్తున్నాం అని ఆయన సెలవిచ్చారు. పనిలోపనిగా భారతీయ జనతా పార్టీ వైఖరిని జేసీ తూర్పారపట్టారు. తనకు కలిగిన ఫీలింగ్‌ను ఏమాత్రం దాచుకోకుండా.. ఎంతటివారినైనా ఎంతలేసి మాటలైనా అనేయగల నాయకుడిగా పేరున్న జేసీ దివాకరరెడ్డి, భారతీయ జనతా పార్టీ వంచిస్తున్నదని చెప్పకనే చెప్పారు. మిత్రపక్షం అయిన నేపథ్యంలో భాజపా మీద పెద్దగా నిందలు వేయకుండా, తెదేపా నాయకులంతా కర్రవిరగకుండా, పాముచావకుండా మాట్లాడుతున్న సమయంలో.. జేసీ మాత్రం.. వారిపై సెటైర్లు వేశారు. అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారం దక్కిన తర్వాత మరో రకంగా భాజపా నాయకులు మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 


తెలుగుదేశం ఎంపీలకు సిగ్గులేదని వ్యాఖ్యానించిన పవన్‌కల్యాణ్‌ను కూడా జేసీ దివాకరరెడ్డి విడిచిపెట్టలేదు. పవన్‌కల్యాణ్‌ హోదాకోసం ఉద్యమిస్తే గనుక ఆయన వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అంటూ జేసీ సెలవిచ్చారు. ఏపీకి కేంద్రంనుంచి ప్రత్యేక ఆర్థికసాయం కోసమే మేం ఎక్కువ ప్రయత్నిస్తున్నాం అని తేల్చేశారు. అయితే.. శుక్రవారం నాటి కేబినెట్‌ భేటీలో కేంద్రాన్ని ఎక్కువగా విమర్శించకుండా.. సానుకూలంగా ఉంటూనే, ప్రత్యేకహోదా విషయంలో వ్యవహరించాలని చంద్రబాబు సహచరులకు మార్గదర్శనం చేసిన మరురోజే.. జేసీ కేంద్రాన్ని కూడా నిందించడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: