పాపం.. ఆయన కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఒకేసారికి ప్రధాని పీఠాన్ని అధిష్టించాలని నిరీక్షిస్తున్న నాయకుడు. ఆయనను భజన చేయడం ద్వారా పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని నమ్మే అనేక వేల మంది కార్యకర్తలు కూడా అదే కోరికతో ఉంటారు. కానీ.. బ్యాడ్‌లక్‌.. ప్రధాని కావడం సంగతి అటుంచి.. ఆయనకు ఐరన్‌లెగ్‌ అని ముద్రపడిపోతూ ఉన్నది. కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ ఏరాష్ట్రంలో ప్రచారం చేసినా.. అక్కడ పార్టీ గెలిచే అవకాశమే లేదని.. పాత అనుభవాలు ఆ పార్టీకి ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉంటాయి. కాంగ్రెస్‌ అంటేనే రాహుల్‌ అన్నట్లుగ గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనను విపరీతంగా పబ్లిసిటీలో ప్రొజెక్టు చేస్తే... మొత్తానికి పార్టీ సకలభ్రష్టత్వం చెందింది. అన్ని రకాలుగానూ మునిగిపోయింది. అయినా సరే నాయకులు మాత్రం ప్రచారానికి ఆయన వెంటపడుతూనే ఉన్నారు. 


తాజాగా తెలంగాణలో వరంగల్‌ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఈ నెలలో రాహుల్‌ను తీసుకువచ్చి.. భారీ ఎత్తున తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని టీపీసీసీ భావిస్తున్నదిట. ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంనుంచి పోటీచేయడానికి పార్టీలో సిద్ధంగా ఉన్నదెవరో.. లేదా ఆశిస్తున్నదెవరో లెక్క తేలలేదు. అయితే ప్రచారానికి మాత్రం రాహుల్‌ను తీసుకురావడానికి సిద్ధమైపోతున్నారు. ఇదే ఎజెండాతో పార్టీ చీఫ్‌ ఉత్తంకుమార్‌రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లారు. 


రాహుల్‌ పర్యటన తేదీల ఖరారుకోసం ఆయన దిగ్విజయసింగ్‌తో భేటీ కూడా అయ్యారు. రాహుల్‌ ఈదఫా తెలంగాణకు వస్తే... ఉస్మానియా, కాకతీయ విద్యార్థులతో భేటీ కావడంతో పాటూ.. వరంగల్‌ ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాహుల్‌ ప్రచారంతో యుద్ధ భేరి మోగిస్తే.. పార్టీ శ్రేణులకు ఉత్సాహం వస్తుందని.. ఎన్నికల బరిలో ఘనంగా దిగవచ్చునని.. విజయావకాశాలు పెరుగుతాయని అంటున్నారు. 


అయితే.. వరంగల్‌ ఎన్నికల ప్రచారానికి వస్తే.. ఇప్పటికే రాహుల్‌కు ఐరన్‌లెగ్‌ అని ఉన్న పేరు మరింత స్ట్రాంగ్‌ అవుతుందేమోనని పలువురు పార్టీలోనే భయపడుతున్నారు. కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటును మళ్లీ తామే దక్కించుకోగలమని అధికార తెరాస చాలా ధీమాగా ఉంది. వారి నమ్మకమే నిజమైతే గనుక.. మళ్లీ అందరూ రాహుల్‌ ను ఐరన్‌ లెగ్‌ అంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాహుల్‌ ఇలాంటి సెంటిమెంట్లను లెక్కచేస్తారో లేదో!!


మరింత సమాచారం తెలుసుకోండి: