సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి భవిష్యత్తు అవకాశాలను దృఢంగా నిర్మించుకోవాలనే ఆలోచనను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వదులుకున్నట్లు అందరూ భావించారు. కేవలం ఒక ఎంపీ, ముగ్గరు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో గెలిచారు. వారిలో ఒకరు పార్టీ వీడి వెళ్లిపోయారు. జగన్‌ కూడా ఈ రాష్ట్రంలో పార్టీ గురించి ఏమీ పట్టించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో పార్టీ ఏపీకే పరిమితం అవుతుందేమో అనుకుంటుండగా.. తెలంగాణలో తమ అస్తిత్వాన్ని మళ్లీ నిరూపించుకునే ప్రయత్నాలను పార్టీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 


తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలూ కసరత్తు చేస్తున్నాయి. ముందుగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని గరిష్ట స్థానాల్ని గెలుచుకోవాలనుకున్న తెరాస ఇప్పుడు ఒంటరిపోరాటానికైనా సిద్ధపడుతోంది. ఎంఐఎం తమది ఒంటరిపోరాటమే అని తేల్చేసింది. తెదేపాతో సీట్లను పంచుకోవడానికి రాష్ట్ర భాజపా ఇష్టపడుతుందో లేదో తెలీని స్థితి. ఇలాంటప్పుడు మధ్యలో బరిలో తానుకూడా ఉంటానంటూ వైకాపా సంకేతాలు ఇస్తోంది. 


ఆ పార్టీ తరఫున జీహెచ్‌ ఎంసీ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనడానికి ... డివిజన్ల వారీగా కమిటీలను కూడా ప్రకటించేశారు. నిజం చెప్పాలంటే.. హైదరాబాదు జంటనగరాల్లో కూడా వైకాపాకు చెప్పుకోదగ్గ బలం ఉంది. కాకపోతే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. తెలంగాణలో ఎన్నికలు ముందుగా జరగడం, పార్టీకి సంబంధించి కరిష్మా ఉన్న నాయకులంతా.. ఏపీ ఎన్నికల్లో బిజీగా ఉండడం.. ఇక్కడ ఫోకస్‌ పెట్టలేకపోవడం వల్ల పార్టీ ఉన్న బలానికి తగిన ఫలితాన్ని పొందలేకపోయింది. కానీ జీహెచ్‌ఎంసీ లో తమ బలం నిరూపించుకోవాలనే కోరిక వారిలో కలుగుతోంది. అందుకే ఇప్పటినుంచే గట్టి కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. 


సార్వత్రిక ఎన్నికల తర్వాత.. తెలంగాణ పార్టీకి చెల్లెలు షర్మిల ఇన్చార్జి అని జగన్‌ ప్రకటించారు. అయితే ఆమె అప్పుడప్పుడూ ఓదార్పు యాత్రలకు తప్ప.. ఎలాంటి పార్టీ నిర్వహణ కార్యక్రమాల గురించి పట్టించుకోవడం లేదు. జీహచ్‌ఎంసీ బరిలో దిగదలచుకుంటే మాత్రం జగన్‌ స్వయంగా దృష్టి పెట్టేట్లయితే సత్ఫలితాలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: