ఆధ్యాత్మిక విశ్వాసాలు వేరు... మూఢనమ్మకాలు వేరు.. మంచి జరగాలనే కోరికతో పూజాది కార్యక్రమాలు చేయించడం వేరు.. కాస్త శృతి హెచ్చించి క్షుద్ర పూజల దాకా వెళ్లి.. మంచిని దొరకబుచ్చుకోవాలని వెంపర్లాడడం వేరు. రాజకీయాల్లో అధికారం, సక్సెస్‌ ఇలాంటివి కోరుకుంటున్న సమయంలో.. చివరికి క్షుద్ర పూజలకైనా తెగబడేవాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి కథలతో మనకు సినిమాలు కూడా వచ్చాయి. రోజులు బాగాలేవు.. పీడ పట్టి ఉంది అనిపించేప్పుడు కూడా.. దాన్ని వదిలించుకోవడానికి.. కొన్ని అతిశయంగా అనిపించే పూజలను నమ్మకం ఉన్నవారు చేయిస్తుండడం కూడా కద్దు. ప్రస్తుతం రాజస్థాన్‌ రాజమాత... సీఎం వసుంధర రాజె కూడా అదే పనిలో ఉన్నారు. అయితే ఈ ఏకాంత పూజలు ఆమెకు పట్టిన పీడను తొలగిస్తాయో లేదో మాత్రం బోధపడడం లేదు. 


వసుంధర రాజె.. లలిత్‌ మోదీకి సంబంధించిన వివాదంలో పీకల్దాకా కూరుకుపోయి ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ కుంభకోణంలో కీలక వ్యక్తి అయిన లలిత్‌ మోదీ నుంచి భారీస్థాయిలో లబ్ధి పొందినట్లు రాజె మీద ఆరోపణలున్నాయి. ఆమెను పదవినుంచి రాజీనామా చేయిస్తే తప్ప.. పార్లమెంటును కూడా జరగనివ్వబోయేది లేదంటూ ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీ నానా రభస చేస్తోంది. 


ఇలాంటి నేపథ్యంలో గతంలో కొన్ని పుకార్లు వచ్చాయి. వసుంధర రాజె విషయంలో ఆమెను ఉపేక్షించే ఉద్దేశం ప్రధాని నరేంద్రమోడీకి వ్యక్తిగతంగా లేదనా పుకార్లు వచ్చాయి. అయితే పార్టీలో చర్చించిన మీదట.. ఆమెతో రాజీనామా చేయిస్తే.. దాని పర్యవసానాలు ఇంకా పార్టీని ఇరుకున పెడతాయనే చర్చ రావడంతో.. కేవలం పార్టీకి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆమెను వదిలిపెట్టారని కూడా అనుకున్నారు. 


అయితే ఇలాంటి పీడ మొత్తం తొలగిపోవాలని అనుకున్నారో ఏమో గానీ.. వసుంధరరాజె.. తాజాగా చాలా ఏకాంతంగా మధ్యప్రదేశ్‌లోని ఒక శక్తి ఆలయంలో మూడు రోజుల పాటూ రహస్య పూజలు చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దతియా అనే పట్టణంలోని పీతాంబరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారుట. ఈ పూజల కోసం ఆమె మూడురోజుల పాటూ బాహ్యప్రపంచంలో ఎవ్వరితోనూ మాట్లాడకుండా... ఆలయంలోనే ఒక గదిలో ఒంటరిగా ఉండిపోయారుట. ప్రధానపూజారితో తప్ప కనీసం మరెవ్వరితోనూ మాట్లాడకుండా ఉండి ఈ పూజలు చాలా నిష్టగా జరిపించారుట. మరి ఇంత కష్టపడినందుకైనా.. ఆమెను చుట్టుకున్న లలిత్‌ మోడీ పీడ తొలగిపోతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: