ప్రస్తుతం వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో రెండు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఈనెల పదోతేదీన - ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సాధించడం కోసం .. యావత్తు వైకాపా శ్రేణులతో ఆయన ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద సాగించబోతున్న పోరాటం. మరొకటి.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి నిలువెత్తు ఫోటోను తొలగించేయడానికి సంబంధించి.. సాగిస్తున్న పోరాటం. అయితే క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే.. ఈ రెండు అంశాలు కూడా ఒక పట్టాన తేలేవిగా కనిపించడం లేదు. ఏ ఒక్క దానిలో విజయం సాధించినా.. అది జగన్‌ హీరోయిజం కిందికే వస్తుంది. 


అటు ఒకటో పోరాటం విషయంలో.. కేంద్రం ప్రత్యేకహోదా పై ఏ విషయం తేల్చిచెప్పే వరకు పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని సాక్షాత్తూ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చెప్పారు. మరోవైపు రెండో పోరాటం విషయంలో.. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా ఆ ఫోటో తిరిగి పెట్టకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైకాపా ఎమ్మెల్యేలు స్పీకరునే హెచ్చరించారు. 


ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం ఒక పట్టాన తేలుస్తుందని అనుకోవడం భ్రమ. ఒకవైపు ఎందరు తూర్పారపడుతున్నా.. భాజపా కేంద్ర నాయకులు కనీసం నోరు మెదపడం లేదు.అసలుహోదా అనేది ఎవ్వరికీ సాధ్యం కాదంటూ చెప్పేస్తున్నారు. తెదేపా 'సానుకూల వైఖరి' అంటూ ఒక డ్రామా నడిపిస్తోంది. కేంద్రం హోదా ఇచ్చేంతవరకు పోరాటం అని చెప్పిన జగన్‌, 10న ఢిల్లీలో అయిదు గంటల ధర్నా తర్వాత.. తదుపరి కార్యాచరణ ఏమిటో ఇప్పటిదాకా ముడివిప్పలేదు. చూడబోతే.. ఆ ధర్నాతో కాడి పక్కన పారేస్తారని పలువురు అనుకుంటున్నారు. అలాంటి విమర్శలు నిజం కాకుండా.. మడమ తిప్పని పోరాటం ఎలా కంటిన్యూ అవుతుందో ఆయన కనీసం ఆరోజున అయినా ప్రకటిస్తే బాగుంటుంది. 


కనీసం ఫోటో విషయంలోనైనా జగన్‌ విజయం సాధిస్తారో లేదో చూడాలి. ఇక్కడ మాజీ సీఎంల ఫోటోలు పెట్టే సాంప్రదాయం లేదు అంటూ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఒకే గాటన కట్టేశారు స్పీకరు. ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాసినా కూడా అదే సమాధానం ఇచ్చారు. మరి స్పీకరు మీద ఎలాంటి ఒత్తిడి తీసుకువచ్చి.. వైఎస్సార్‌ ఫోటో ఉండడాన్ని ఎలా సమర్థించుకుని.. దాన్ని తిరిగి సాధిస్తారో జగన్‌ ప్లాన్‌ చేసుకోవాలి. ఈ రెండింట్లో ఏదో ఒకటి విజయం సాధించకపోతే పరువునష్టం అని ఆయన గుర్తించాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: