కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌.. చాలా లౌక్యంగా వివరణలు ఇవ్వడంలోనూ, తాను చెప్పదలచుకున్నది మాత్రం చెప్పేసి.. ఎదుటి వాళ్లు ఏం అడిగారో ఆ విషయాన్ని మాత్రం టచ్‌ చేయకుండానే.. అంతా చెప్పేసినట్లు అడిగిన వారికే భ్రమ కల్పించడంలో వెంకయ్యనాయుడునే మించిపోయినట్లు కనిపిస్తున్నారు. కేంద్రంమంత్రి ఇంద్రజీత్‌ సింగ్‌ లోక్‌సభలో దేశంలో రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇవ్వడం గురించి.. విస్పష్టమైన ప్రకటన చేసిన నాటినుంచి.. ఏపీ కి హోదా దక్కే విషయంలో రచ్చ రచ్చ అయిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంతసేపూ తెలుగుదేశానికి చెందిన వాళ్లందారూ 'ఈ ప్రకటనతో మన రాష్ట్రానికి సంబంధం లేదనడం' మిగిలిన పార్టీల వాళ్లందరూ.. 'భాజపా చేసిన మోసం అందరికీ అర్థమైనా తెదేపాకు తెలియలేదా' అని ఎద్దేవా చేయడం పరిపాటి అయిపోయింది. ఎంతసేపూ తెలుగుదేశం వారు వివరణలు కాకుండా, కేంద్రంలోని భాజపా మంత్రులు మాట్లాడితే బాగుంటుందని కూడా సూచనలు వచ్చాయి. 


అలాంటి సూచనలు ఆలకించినట్లే కనిపిస్తూ.. కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి.. ఏపీ నుంచే రాజ్యసభ ఎంపీగా అవకాశాన్ని కూడా దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌.. ఆదివారం నాడు ఈ ప్రత్యేక హోదా రగడ గురించి వివరణ ఇచ్చారు. ఎవ్వరికీ ఎలాంటి కన్ఫ్జూన్‌ లేకుండా ఆమె చక్కగా తెలుగులోనే వివరణ ఇచ్చారు. ఆమె వివరణ చక్కగానే పొందికైన భాషలోనే చెప్పారు గానీ.. అంతా పూర్తయిన తర్వాత.. ఏం చెప్పారో.. ఇంతకూ ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది వస్తుందో రాదో మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆమె తన మాటల్లో అంతగా అలవిమాలిన లౌక్యాన్ని ప్రదర్శించారు. 


ఇంతకూ ఆమె ఏం చెప్పారో తెలుసా? 'ఇంద్రజీత్‌ సింగ్‌ చెప్పింది.. స్పెషల్‌ స్టేటస్‌ గురించి.. కానీ నేను మాట్లాడుతున్నది స్పెషల్‌ ప్యాకేజీ గురించి. మీరు మళ్లీ నా మాటల్ని కూడా మీకు తోచినట్లుగా భాష్యాలు చెప్పి వేసేయవద్దండి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో.. బీహార్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం గురించి ఆ పార్టీ ఎంపీ అడిగినప్పుడు.. ఆ కాంటెక్ట్స్‌లో మాత్రమే అలాంటి విధానం లేదని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి దానిని ముడిపెట్టడం తగదు. విభజన చట్టంలో మేం చేసిన హామీలు అన్నిటినీ నెరవేరుస్తాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు న్యాయం చేస్తాం' అని ఆమె చెప్పారు. 


చెప్పిందంతా బాగానే ఉంది. 'న్యాయం చేస్తాం', 'ప్యాకేజీ' అనే పదాలు తప్ప.. ఇందులో మరో సంగతి లేదు. ఇంతకూ విభజన చట్టంలో 'ఏపీకి ప్రత్యేకహోదా' అనేది ఉన్నదో లేదో ఆమె చెప్పలేదు. ప్యాకేజీ అంటుందే తప్ప.. మనం కోరుతున్న 'హోదా' సంగతేంటో మర్మం చెప్పలేదు. అయినా ఆమె భర్త పరకాల ప్రభాకర్‌కు కేబినెట్‌ ర్యాంకులో చంద్రబాబు కొలువులో సలహాదారు పదవి లభించింది. ఆమె ఇదే రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికై వెళ్లింది. ఇక ఈ రాష్ట్రం- ప్రజలు ఎలా తగలెడితే తనకెందుకు అనుకున్నట్లుగా అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: