ఫోన్ ట్యాపింగ్.. ఈ అంశం రెండు నెలల క్రితం వరకూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను  ఓ ఊపు ఊపేసింది. దొంగతనం చేస్తూ నేరుగా దొరికిపోయి.. తప్పించుకోవడానికే చంద్రబాబు  ఈ ట్యాపింగ్ రాగం ఆలపిస్తున్నారని..ఈ ఇష్యూ వెలుగు చూసిన మొదట్లో గులాబీ నేతలంతా గోల గోల పెట్టేశారు. తాము అసలు ట్యాపింగే చేయలేదని.. ట్యాపింగ్ కు ఫోన్ రికార్డింగు కూడా తేడా తెలియకుండా మాట్లాడేస్తున్నారని ఏకంగా మంత్రులంతా మీడియా ముందు క్యూ కట్టి మరీ చెప్పేశారు. కానీ ఇప్పుడదంతా శుద్ధ అబద్దమని తేలిపోయింది. 

తన గొంతు ఉన్న ఆడియో టేపులు బయటకు రావడంలో ఒక్కసారిగా డిఫెన్సులో పడిపోయిన బాబు.. కాస్త రెండడుగులు వెనక్కు వేసినట్టు అనిపించినా.. శరవేగంగా పుంజుకున్నారు. అసలేం జరిగిందో ఆరా తీయించేశారు. తెలంగాణ ట్యాపింగ్ చేసిందని నిర్దారణకు వచ్చేసి.. ఆ పాయింట్ మీద తన ఆడియో టేపుల ఇష్యూను సింపుల్ గా పక్కదారి పట్టించేసి పొలిటికల్ గేమ్ లో పైచేయి సాధించేశారు. అంతటితో ఆగకుండా.. తెలంగాణ సర్కారుపై కేసులు కూడా పెట్టించేసి వ్యవహారం అంతు తేల్చేందుకు ప్లాన్ చేశారు. 

మొత్తానికి కేసీఆర్ - చంద్రబాబు మైండ్ గేమ్.. యమా ఇంట్రస్టుగా సాగినా.. చివరకు పరస్పరం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిపోయిందని అందరికీ అర్థమైపోయింది. అయితే.. ఇంతకీ తెలంగాణ సర్కారు ఎన్ని ఫోన్లు ట్యాప్ చేసింది.. పదా.. ఇరవయ్యా.. చంద్రబాబు మొదట్లో 120 అన్నారు.. ఇప్పుడేమో టీడీపీ నాయకులు 200 దాటిందని అంటున్నారు. ఇదంతా అంతా ఎక్స్ పెక్ట్ చేసిందే అయినా.. ఇప్పుడు టీడీపీ నాయకులు ఇంకో కొత్త వాదన తీసుకొస్తున్నారు. 

అదేంటంటే.. కేవలం టీడీపీ నాయకులు, ఏపీ అధికారుల ఫోన్లే కాకుండా.. చివరకు టీడీపీ బీట్ చూసే రిపోర్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి ఏకంగా ఓ ప్రెస్ మీట్లో టీడీపీ నాయకుడే బహిరంగంగా చెప్పేశారు. రాజకీయ నాయకులకూ.. విలేకర్లకూ మధ్య సవాలక్షా కబుర్లుంటాయి. సొంత పార్టీ వారితో మాట్లాడలేదని సంగతులు కూడా లీడర్లు.. బాగా పరిచయమున్న విలేకర్లతో పంచుకుంటారు. నీతో కాబట్టి చెబుతున్నా.. ఎక్కడా లీక్ చేయకంటూ భలే భలే సీక్రెట్లు చెబుతారు. మరి వారి ఫోన్లు కూడా ట్యాపైతే.. మరిన్ని సీక్రెట్లు బయటపడటం ఖాయం. ఇంతకీ రిపోర్టర్ల ఫోన్లు నిజంగా ట్యాపయ్యే ఉంటాయా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: