వైద్య రంగంలో మన తెలుగు వారు వినూత్న ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా నిమ్స్ వైద్యులు మరోసారి చరిత్రను సృష్టించారు. తొలిసారి విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి, లివర్‌ కేన్సర్‌, సిరోసిస్‌తో బాధపడుతున్న రోగికి వైద్యులు ప్రాణదానం చేశారు.  కాలేయ మార్పిడితో ఓ జీవితానికి పునర్జన్మ ప్రసాదించారు. కర్నూలు జిల్లా అవుకుకు చెందిన ఎక్కలూరు సత్యమయ్య(61) వ్యక్తికి హెపటైటీస్‌ బీ, లివర్‌ సిరోసిస్‌, కాలేయ కేన్సర్‌ ఉన్నట్లు నిర్ధారించారు. కాలేయ మార్పిడి చేయాలని సూచించారు.

ఇటీవలే వెస్ట్ మారేడుపల్లికి చెందిన అభిజిత్ (20) అనే యువకుడు బ్రెయిన్‌డెడ్‌ అవడంతో అతడి కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆపరేషన్‌ ప్రారంభించిన ప్రొఫెసర్‌ బీరప్ప వైద్య బృందం 18 గంటలు శ్రమించి ఆపరేషన్‌ చేశారు. ప్రస్తుతం సత్యమయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని ప్రొఫెసర్ బీరప్ప చెప్పారు. 
ఇక హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు.

 డెరైక్టర్ నరేంద్రనాథ్‌తో కలసి మంత్రి మాట్లాడుతూ నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ట్విన్ టవ ర్స్ నిర్మించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతోందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.  కాలేయ మార్పిడి చికిత్స కోసం నిమ్స్‌లో మరో ఐదుగురు రిజిస్ట్రర్ చేయించుకున్నారని, వారికి కూడా ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: