ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి తీరుతుందనే.. ఏపీకి చెందిన తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఇందుకోసం కేంద్రంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదని, కేవలం వారి మీద కొంత ఒత్తిడి తెస్తే సరిపోతుందని స్పీరు కోడెల శివప్రసాద రావు తాజాగా తనదైన భాష్యం చెప్పారు. తద్వారా.. ఈనెల పదో తేదీన ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు ఉపక్రమిస్తున్న వైకాపా శ్రేణులపై ఆయన ఒక రకంగా సెటైర్‌ వేసినట్లయింది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే కాదనే వాళ్లు ఎవ్వరూ లేరని.. అందువల్ల కేంద్రం తలచుకుంటే గనుక.. ఖచ్చితంగా హోదా వస్తుందని కోడెల శివప్రసాదరావు అంటున్నారు. 


నిజానికి దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకహోదా ఇచ్చే విధానమే లేదంటూ.. పార్లమెంటులో ఇంద్రజీత్‌ సింగ్‌ ప్రకటన చేసిన తర్వాత.. పెద్దఎత్తున దుమారం రేగుతోంది. ఏపీలో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. పార్టీలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే కేంద్రంతో సానుకూలంగా ఉండి సాధించుకోవాలే తప్ప.. పోరాడి ప్రయోజనం లేదని సీఎం చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు ఉద్బోధ చేస్తున్నారు. ఆయన పార్టీ ఎంపీలంతా అదే పాట పాడుతున్నారు. జగన్‌ పోరాడితే పోరాడనివ్వండి.. రాష్ట్రం కోసం ఆయన ఏమైనా చేయాలనుకుంటే మంచిదేగా అని అంటున్నారు. 


ఇదంతా ఇలా ఉండగా.. ఇవాళ కోడెల చెప్పిన మాటల్లో కీలకంగా గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి దేశంలోని మిగిలిన రాష్ట్రలు అన్నీ కూడా ఒప్పుకోవాల్సి ఉంటుందని.. తొలినుంచి వెంకయ్యనాయుడు అంటున్నారు. చట్టంలో ఉన్న దానికి అలాంటి నిబంధన ఏమిటో అర్థం కాదు గానీ.. ఒకవేళ అది అవసరం అనుకున్నప్పటికీ.. ఎన్డీయే కూటమికి చెందిన పార్టీలే 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. వారందరితో ఒప్పించే సత్తా వెంకయ్యకు ఉన్నదా లేదా అనేది కీలకం. అలాగేే ఏపీకి ప్రత్యేకహోదా ఇప్పించడానికి ఎంతవరకైనా పోరాడుతాం అని ప్రకటిస్తూ వస్తున్న కాంగ్రెస పార్టీ.. తమ పార్టీ లేదా తమ కూటమి పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఆమోదాన్ని సాధించగలదని అనుకోవాలి. ఒకవేళ వారి సంగతి పక్కన పెట్టినా.. కనీసం మరో మూడురాష్ట్రాలను ఒప్పించడానికి చంద్రబాబు తన చాణక్యం ప్రదర్శించాలి. 


ఇప్పుడు కోడెల శివప్రసాద్‌ మాత్రం.. అచ్చంగా.. దేశంలోని ఏరాష్ట్రమూ మనకు హోదా ఇవ్వడాన్ని అడ్డుకోదు అంటున్నారు. ఏపీ రాజధాని కూడా లేకుండా ఏర్పడిన పరిస్థితులు అందరికీ తెలుసు అని.. అందువలన.. ఎవ్వరూ వ్యతిరేకించరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఆ నమ్మకం ఉంటే ఇక వారు చేయాల్సినదెల్లా.. కేంద్ర ప్రభుత్వంలో కదలిక తేవడం మాత్రమే. అన్ని రాష్ట్రాలకు అభ్యంతరాల గురించి లేఖలు రాసేలా చూస్తే.. తొలుత ఆ ప్రక్రియ ప్రారంభం అయ్యేలా చూస్తే.. తర్వాత.. మిగిలినది దానంతట అదే జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. మరి చంద్రబాబు టర్కీ టూరునుంచి తిరిగి వచ్చిన తర్వాత.. ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: