ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప తన పదవికి రాజీనామా చేసేశారనే పుకార్లు కొన్ని రోజుల పాటూ ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా షికారుచేశాయి. కాకపోతే.. పుష్కరాల్లో తొలిరోజున అంతమంది చనిపోవడానికి ఆయన నైతిక బాధ్యత వహించినట్లుగా.. అందుకే ఆ అంతర్మధనంలోనే పాపం.. పదవిని త్యజించడానికి పూనుకున్నట్లుగా.. వార్తలు వచ్చాయి. అయితే ఆయన త్యాగానికి చలించిపోయిన చంద్రబాబు ఆ రాజీనామాకు ఒప్పుకోలేదని.. తిరస్కరించారని కూడా వార్తలు వచ్చాయి. 


కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాత్రం గుసగుసలు మరో విధంగా వినిపిస్తున్నాయి. చినరాజప్ప రాజకీయాల్లో గానీ, హోంశాఖను నిర్వహించడంలో గానీ ఎంతో అమాయకంగా కనిపిస్తూ ఉంటారు గానీ.. ఈ రాజీనామాను మాత్రం చాలా ముందుచూపుతో వ్యూహాత్మకంగా చేశారని అంతా అనుకుంటున్నారు. చంద్రబాబునాయుడు త్వరలోనే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేస్తారనే పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. అసమర్థుల్ని తప్పించాలని, లేదా, శాఖలు మార్చాలని బాబు యోచిస్తున్నట్లుగా సమాచారం. ఆ కేటగిరీలో తన పదవి మారుతుందో.. ఊడుతుందో తెలియక చినరాజప్ప సందిగ్ధంలో ఉన్నారుట. అందుకే చంద్రబాబుకుముందే రాజీనామా లేఖ ఇచ్చేసి ఓ అస్త్రం సంధించారుట. రాజీనామా లేఖను తిరస్కరించి.. ఊరడించారు గనుక.. ఈ ఎఫెక్టు విస్తరణ సమయంలో తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఉంటారని అందరి అంచనా. 


అందుకే చినరాజప్ప ముందుచూపునకు అందరూ నివ్వెరపోతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల మెడపై కత్తి వేలాడుతున్నదనే ప్రచారం బాగా ఉంది. అందులో చినరాజప్ప ఉన్నా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు. అలా జరగకుండా చూసుకోవడానికే.. ఈ రాజీనామా అనేది ఒక సింగిల్‌ ఎపిసోడ్‌ లాగా నడిపించారనేది పార్టీలో వినిపిస్తున్న గుసగుస. అదే నిజమైతే గనుక.. మరికొందరు మంత్రులు కూడా ఈ డ్రామాను ఫాలో అయిపోతారేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: