భారతీయ జనతా పార్టీ అంటే అంతో ఇంతో విలువలు కలిగి ఉండే పార్టీ, విలువలు పాటించే పార్టీ.. ఇతర సాంప్రదాయ కుహనా పార్టీల్లాగా కాకుండా సిద్ధాంతాల 
పునాదుల మీద నిర్మితమైన పార్టీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం మోడీ సారథ్యంలో.. అలాంటి పేరును ఆ పార్టీ స్వయంగా 
చెరపివేసుకుంటున్నది. అధికారం దక్కేసరికి అంతా ఒక తానుముక్కలే అని నిరూపించుకుంటున్నది. అధికార పార్టీకి చెందిన వారి అవినీతి వ్యవహారాలపై 
ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తోంటే.. టెక్నికల్‌ పాయింట్లు చెప్పి సమస్యను దాటవేయడానికి ప్రయత్నిస్తున్నది భాజపా. 


గతంలో కాంగ్రెస్‌ ఏలుబడి సాగుతున్న రోజుల్లో.. ఆ పార్టీకి చెందిన కేంద్ర మత్రుల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వారి 
రాజీనామా కోసం చాలా గట్టిగా పట్టుపట్టింది. కాంగ్రెస్‌కు ఊపిరాడనివ్వకుండా వారు అప్పట్లో పోరాటం సాగించారు. ఇప్పుడు రోజులు మారాయి. కాంగ్రెస్‌ 
ప్రతిపక్షంలోకి వచ్చింది. అప్పట్లో గొడవలు చేసిన భాజపా గద్దె ఎక్కి కూర్చుంది. మళ్లీ సీన్‌ రిపీట్‌. భాజపా కేంద్రమంత్రులు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. 
అప్పటినుంచి వారి రాజీనామాలకు గొడవ మొదలైంది. 


సరిగ్గా పార్లమెంటు సమావేశాలు రావడంతో.. కాంగ్రెస్‌ చేస్తున్న రభస పరాకాష్టకు చేరుకుంది. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి 
సుష్మాస్వరాజ్‌, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె, మధ్య ప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ లు రాజీనామా చేస్తే తప్ప.. సభా కార్యక్రమాలను ముందుకు 
సాగనివ్వబోం అన్నది కాంగ్రెస్‌ ప్రతిజ్ఞ. ముందు చర్చిద్దాం.. తర్వాత ఆలోచిద్దాం అంటూ నయగారపు మాటలు ప్రభుత్వం వల్లెవేస్తున్నది. కాంగ్రెస్‌ ఎంతకూ 
దిగిరాకపోగా.. తాజాగా వారి ఎంపీలు 25 మందిని సభనుంచి సస్పెండ్‌ చేయడం కూడా జరిగింది. 


అదే సమయంలో భాజపా మేధావుల్లో ఒకరైన అరుణ్‌జైట్టీ , తమ పునాది అయిన నైతికతను వదిలేసి.. టెక్నికల్‌ అంశాల గురించి మాట్లాడుతున్నారు. గతంలో 
కాంగ్రెస్‌ పాలనలో కాగ్‌ నివేదిక సమర్పించి, ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత మాత్రమే తాము మంత్రుల రాజీనామాలు డిమాండ్‌ చేశాం అని, ఇప్పుడు తమ 
మంత్రుల మీద ఎఫ్‌ఐఆర్‌ లేకపోయినా కాంగ్రెస్‌ రాజీనామాలు కోరుతున్నదని.. వాదిస్తున్నారు. అంటే భాజపాకు అయినా సరే.. అధికారం చేతిలో ఉంటే.. 
రూల్సు గుర్తుకొస్తాయి తప్ప... నైతికత విలువలు అనేవి అటకెక్కిపోతాయన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: