తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో తొలిసారిగా నియామక పరీక్షలు జరగబోతున్నాయి. దేశంలోనే ఆదర్శవంతమైన విధానాన్ని రూపుదిద్దడం ద్వారా పేరు తెచ్చుకోవాలని తెలంగాణ సర్కారు కోరుకుంటున్నది. అందులో భాగంగానే పరీక్షల నిర్వహణలో పెద్దఎత్తున సాంకేతిక విప్లవాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే పరీక్షల్లో సాంకేతికత మద్దతుతో అక్రమాల నిర్వహణకు ఇన్ని ఆలోచనలు చేస్తున్నారు బాగానే ఉంది. పరీక్షల అనంతరం జరిగే అవినీతి బాగోతాలకు కూడా చెక్‌ పెట్టడానికి కొత్త సాంకేతిక విధానాల్ని కనుగొనాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. 


తాజాగా టీఎస్‌పీఎస్సీ సాంకేతికంగా ఉన్నతస్థాయి ఆలోచనలతో అక్రమాలకు చెక్‌పెట్టనుంది. ఇలాంటి పరీక్షల్లో.. నకిలీ అభ్యర్థులు పరీక్షలు రాసే ప్రమాదం ఉండడంతో.. నిరుద్యోగుల ఆధార్‌ కార్డులను నమోదు చేయించుకుని.. వారి ఆధార్‌లో నమోదై ఉండే వేలిముద్రలతో సరిపోలితేనే పరీక్ష రాయించేలా.. ఏర్పాట్లు చేయబోతోంది. అలాంటి సాంకేతిక ఏర్పాట్లతోనే పరీక్షహాళ్లు ఉంటాయి. పశ్న్రపత్రాలు జంబ్లింగ్‌ గా ఉంటాయి. మొత్తానికి రకరకాల కొత్త ఆలోచనలతో నిరుద్యోగులు అనుసరించగల అక్రమ విధానాలకు చెక్‌పెట్టడానికి సర్కారు చూస్తోంది. 


అయితే సాధారణంగా పరీక్షల్లో జరిగే అక్రమాల కంటె పరీక్షల తర్వాత జరిగే అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గతంలో సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు ఎన్నెన్ని అక్రమాలకు పాల్పడ్డారో లీక్‌ అయిన కొద్దీ జనం నివ్వెరపోయారు.నిప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలిసారి నిర్వహిస్తున్న సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో ఇలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పరీక్షలు అయిన తర్వాత వీలైనంత వెంటనే.. ఫలితాలను ప్రకటించడం, అన్నీ ఓటీఆర్‌ ప్రశ్నపత్రాలే గనుక.. వీలైనంత త్వరగా ఫలితాలు ఇవ్వడం, మొత్తం అందరు అభ్యర్థుల జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచడం. పరీక్ష పూర్తయిన వెంటనే దాని కీని ఆన్‌లైన్‌ లో ఉంచడం. ఇంటర్వ్యూలను వీడియో రికార్డింగ్‌ చేసి.. ప్రభుత్వం వద్ద భద్రపరచడం వంటి చర్యలు తీసుకుంటే.. అవినీతికి ఆస్కారం తగ్గుతుందని పలువురు సూచిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఎంత మేరకు దృష్టిసారిన్తుందో మరి! 


మరింత సమాచారం తెలుసుకోండి: