ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ ఇప్పుడు కష్టకాలం వచ్చేసింది. ప్రత్యేకించి వర్షాభావంతో చుక్కనీరు లేక.. సాగు ముందుకు సాగే ఆశ లేక అన్నదాత ఆందోళనలో పడ్డాడు. వర్షాకాలంలా కాకుండా వేసవి కాలాన్ని తలపిస్తున్నభానుడి ప్రతాపంతో ఆశలు మరింత సన్నగిల్లుతున్నాయి. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ఆయుకట్టు రైతులకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పెద్ద షాకే ఇచ్చింది.

ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఉన్న జలాలు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయట. అందుకే ఖరీఫ్ కి పంటకు నీరు ఇవ్వడం సాధ్యం కాదని కృష్ణానదీ యాజమాన్య బోర్డు తేల్చి చెప్పేసింది. సోమవారం హైదరాబాద్ లో ఈ యాజమాన్య బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు ఛైర్మన్ పండిట్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఇఎన్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ఏమాత్రం రావడం లేదట. ఈ పరిస్థితుల్లో కేవలం పది నుంచి పన్నెండు టిఎంసిల నీరు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందట. తాగునీటి కోసం ఆ మాత్రం నీరు తప్పనిసరిగా ఉండాలని బోర్డు అభిప్రాయపడింది. హైదరాబాద్ మహా నగరంతో పాటు, నల్గొండ జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలలో తాగునీటి అవసరాలకు మాత్రమే సాగర్ జలాల ఉపయోగించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. 

సో.. ఈ ఖరీఫ్ కి కృష్ణాడెల్టా, సాగర్ అయుకట్టుకు నీరు అందడం దాదాపు లేనట్టే. ఐతే ఇదే ఫైనల్ నిర్ణయం కాదట. మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారట. కృష్ణా జలాలపై తెలంగాణ, ఆంధ్రా మధ్య తరచూ వివాదాలు వస్తున్నందువల్ల.. ఇకపై కృష్ణాజలాల వినియోగానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందరికీ తెలిసేలా ఓ వెబ్ సైట్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: