సాక్షి మీడియా.. తండ్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ కు చేసిన అతి పెద్ద మేలు అని చెప్పుకోవచ్చు.. ఈ సాక్షి పత్రిక,టీవీ లేకపోతే.. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ ఓ సాధారణ నాయకుడిగానే మిగిలిపోయే వాడే అన్నా..అతిశయోక్తి లేదు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కుమారులు ఏం చేస్తున్నారో.. జగన్ కూడా అదే రేంజ్ లో ఉండేవారు. కానీ సాక్షి మీడియా ద్వారా జగన్ ను బాగా ఫోకస్ చేయడం, వైఎస్ మహాత్ముడంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేయడం.. ఆయన మరణాన్ని సానుభూతిగా మలచుకోవడం.. ఈ అన్ని అంశాల్లో సాక్షి మీడియా పాత్ర ఎంత మాత్రం విస్మరించలేం. 

సాక్షి పత్రిక, టీవీ తెలుగు మీడియాలో ఓ సంచలనమే చెప్పొచ్చు. కాకపోతే.. గతంలో వైఎస్ భజన.. ప్రస్తుతం జగన్ భజన మరీ ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. పత్రిక, టీవీ పెట్టుకున్నదే అందుకోసం కాబట్టి ఆ మాత్రం ప్రచారం తప్పదేమో. ఐతే.. అలా ఓ స్టాంప్ పడిపోవడం క్రమంగా సాక్షి విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. గతంలో వైఎస్ మరణం తర్వాత ఏడ బోతావు రాజన్నా.. అంటే వేసిన పాటలే వేసి విసుగు తెప్పించారు. 

ఆ తర్వాత వైఎస్సార్సీపీ భజనలో, చంద్రబాబు వ్యతిరేకవార్తలతో సాక్షి క్రెడిబిలిటీ బాగా తగ్గిపోయింది. అసలు సాక్షికి క్రెడిబిలిటీ ఏంటి.. అని కూడా కొందరు కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. ఐతే.. తాజాగా తమ వ్యూహంపై సమీక్షించుకున్న సాక్షి మీడియా.. ఇప్పుడు పూర్తిగా ప్లాన్ మార్చేసిందట. అన్ని పార్టీలు, వార్తలు సమ ప్రాధాన్యతతో కవర్ చేయాలని నిర్ణయించుకుందట. కేవలం వైఎస్సార్ సీపీ ఛానల్ గా ముద్రపడితే.. అది పార్టీకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారట.

సో.. గతంలో కేవలం వైఎస్సార్ సీపీ నాయకుల ప్రెస్ మీట్లే గంటల తరబడి ప్రసారం చేసిన సాక్షి.. ఇప్పుడు  సచివాలయం నుంచి వచ్చే ప్రతి మంత్రితో పాటు సిఎం చంద్రబాబు లైవ్ తప్పనిసరిగా ప్రసారం చేస్తోంది. క్రెడిబిలిటీ పెంచుకునే తాపత్రయంలో... ఒక్కోసారి సొంత పార్టీ వార్తలను కూడా అంతగా కవర్ చేయడం లేదట. ఇటీవల శాసనసభలో వైఎస్ ఫోటో వివాదంపై వైసిపి ఎమ్మెల్యేల ఆందోళనకు సాక్షి టీవీలో కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదట. ఐతే.. మరి ఈ వ్యూహం ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. ఈ కొత్త ప్లాన్ తో మిగిలిన వర్గాలు దగ్గరవుతాయో లేదో కానీ.. ఉన్న ఒక్క వర్గం కూడా దూరమవుతుందేమో అన్న అనుమానం కూడా లేకపోలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: