ఈమధ్య చంద్రబాబు విజయవాడలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అందులో అనేక అంశాలపై చర్చించారు. ఎంతగా పని చేస్తున్నా.. ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా.. జనంలో పార్టీ పట్ల మైలేజీ రావడం లేదన్న విషయాన్ని పార్టీ నాయకులకు నొక్కి చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై నిర్వహించిన ప్రజా సర్వేలోనూ ఆశించిన ఫలితాలు రాలేదన్న చేదు నిజాన్ని నాయకులకు వివరించారు. 

అసలు చంద్రబాబు అంటేనే ప్రచారానికి మారు పేరు.. అయినా జనంలో మంచి పేరు రాకపోవడం అన్యాయం కదా. అందుకే ఆయన ఆ ప్రచారం డోసు మరికాస్త పెంచనున్నారు. ఆ ప్రచారానికి కార్యకర్తలే అసలైన వారధులను భావించిన టీడీపీ.. క్యాడర్ కు భారీ స్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 40 వేల మందికి శిక్షణ ఇస్తారట. 

శిక్షణా కార్యక్రమం అంటే 2,3  రోజులులో వారం రోజులో ట్రైనింగ్ ఇవ్వడం కాదట. ఏకంగా ఏడాది పాటు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందట. అరకు, మదనపల్లి, మేదరమెట్ల, తాడేపల్లి గూడెం ప్రాంతాలను శిక్షణ కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఇక్కడ ఒక్కో గ్రూపుకు వంద మంది చొప్పున నాలుగు కేంద్రాల్లో 400మందికి రెండు రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారట. వారంలో మొత్తం 1200 మందికి.. నెలకు దాదాపుగా 5 వేల మందికి ట్రైనింగ్ ఇస్తారట. ఇలా ఓ ఏడాది పాటు సుమారు 40 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలన్న చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. 

ఫించన్ సొమ్ము ఏకంగా 5 రెట్లు పెంచాం.. రైతుకు రుణమాఫీ చేశాం.. డ్వాక్రా రుణ మాఫీకి నిధులిచ్చాం.. తక్కువ కాలంలోనే రాజధానికి ఓ రూపు తెచ్చాం.. అయినా ఎందుకు జనంలో ఫీల్ గుడ్ ఒపీనియన్ రావడం లేదని ఒకటే బాధపడుతున్న టీడీపీ బాస్ కు ప్రచారం ఉధృతం చేయడం ఒక్కటే పరిష్కారంగా తోచినట్టుంది. అందుకే 40 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చిన జనం మీదకు పంపాలని చూస్తున్నారు. ఇది టీడీపీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామట. కానీ ఒక ధర్మసందేహం. జనం ఎందుకు సంతృప్తిగా లేరో.. వాళ్లనే అడిగి.. ఆ సమస్యలు పరిష్కరించకుండా.. ఇప్పటికే హోరెత్తిపోతున్న ప్రచారానికి ఇంకొంత యాడ్ చేస్తే మాత్రం ఏం ఒనగూరుతుంది.. ఆ ప్రచారం కూడా ఓ మోతాదు మించిదే వికటించదా..?



మరింత సమాచారం తెలుసుకోండి: