అంతా నందమూరి కుటుంబమే అయినా.. వారిలో ఎన్నో విబేధాలున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు కుటుంబం చాలా పెద్దది.. బాలకృష్ణ, హరికృష్ణ, జయకృష్ణ, రామకృష్ణ.. ఇలా ఒకరా.. ఇద్దరా.. వీరికి తోడు ఎన్టీఆర్ కూతుళ్లు భువనేశ్వరి, పురంధేశ్వరి కుటుంబాలు. అన్నీ ప్రముఖమైనవే. అంతమంది కొడుకులున్నా..  భువనేశ్వరి భర్తగారైన చంద్రబాబే ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం అందుకున్నారు. 

ఈ రాజకీయ వారసత్వం విషయంలో నందమూరి కుటుంబంలో కలతలకు కారణమైంది. ఎన్టీఆర్ ను ఎదిరించిన సమయంలో కుటుంబంలో అందరినీ తెలివిగా తన వైపుకు తిప్పుకున్న చంద్రబాబు ఆ తర్వాత హరికృష్ణ, పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావులను క్రమంగా దూరంపెట్టారు. ప్రాధాన్యం తగ్గించారు. దగ్గుబాటి దంపతులు ఏకంగా పార్టీ విడిచి కాంగ్రెస్ లోకి వెళ్లిపోగా.. హరికృష్ణ మాత్రం వేరే దారిలేక టీడీపీలోనే కొనసాగుతున్నారు. 

ఆ మధ్య బాబు తనయుడు లోకేశ్, హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య రాజకీయ వారసత్వం గొడవ వచ్చినప్పుడు చంద్రబాబు తెలివిగా జూనియర్ ను తప్పించారు. చివరకు తన కొడుకు లోకేశే తన వారసుడని తేల్చిచెప్పారు. దానికి అనుగుణంగా పార్టీని సిద్ధం చేసి ఒప్పించారు. జూనియర్ తండ్రిగా ఇది హరికృష్ణను తీవ్రంగా ఇబ్బంది పెట్టినా.. ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే ఆయన కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మాత్రం అప్పుడప్పుడు పార్టీలో తానూ ఉన్నాననిపించుకుంటున్నారు. 

లేటెస్టుగా కృష్ణా జిల్లా ముసునూరు మండలం ఎమ్మార్వో వనజాక్షి ఉదంతంపై హరికృష్ణ గళం విప్పడం ఆసక్తి కలిగిస్తోంది. వనజాక్షిని చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. దీనిపై హరికృష్ణ స్పందిస్తూ.. తాను ఆమెకు అండగా ఉంటానని ప్రకటించారు. వనజాక్షి పోరాటానికి తాము మద్దతు ఇస్తామన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైనవారిపైనా చర్య తీసుకోవాలని కోరారు. ఐతే.. వనజాక్షి విషయంలో చంద్రబాబు ఆమెదే తప్పన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు హరికృష్ణ ఆమెకు మద్దతుగా మాట్లాడటం అంటే.. ఆయన బాబుపై క్రమంగా స్వరం పెంచుతారా.. స్వపక్షంలో విపక్షంగా తయారవుతారా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: