ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, చేతగానితనాన్ని తద్వారా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, అసౌకర్యాన్ని నిలదీయడమే ప్రతిపక్షం పని. అందుకే ప్రజాస్వామ్యంలో అధికారపక్షంతో పాటు ప్రతిపక్షానికీ అంత ప్రాముఖ్యత. ప్రజల కోసం పోరాడటం ద్వారా.. వారి అభిమానం చూరగొంటే.. ప్రతిపక్షాన్ని జనం ఎన్నికల సమయంలో ప్రమోషన్ ఇస్తారు. అధికారపక్షాన్ని ప్రతిపక్షంగా డిమోషన్ ఇస్తారు. 

ఏపీ విషయానికి వస్తే.. ప్రతిపక్ష నేత పాత్రలో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటివరకూ జస్ట్ ఏవరేజ్ మార్కులే వస్తున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా ప్రజాసంక్షేమంతోపాటు తమ పార్టీకీ మైలేజ్ సంపాదించుకోవడం సాధారణమే. కానీ జగన్ మాత్రం ప్రతిపక్షనేతగా కాస్తో కూస్తో బాగానే పని చేస్తున్నాడు.. కానీ ఆ పోరాటాన్ని తన క్రెడిట్ గా మలచుకోవడంలో విఫలమవుతున్నాడన్న వాదన వినిపిస్తోంది. 

మొన్నటికి మొన్న మున్సిపల్ కార్మికుల తరపున పోరాడిన జగన్.. ఆ సమయంలో నాలుగురోజుల్లో సమస్యను పరిష్కరించాలని చంద్రబాబుకు గడువు ఇచ్చారు. ఇదే అదనుగా ఆ సమయంలోపలే చంద్రబాబు సమస్యను పరిష్కరించేశారు. క్రెడిట్ బాబు ఖాతాలోకే వెళ్లింది. ఇప్పుడు కృష్ణా జిల్లా విషజ్వరాల మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలనే అంశంపైనా మరోసారి సేమ్ సీన్ రిపీటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 

కృష్ణా జిల్లా కొత్త మాజేరు గ్రామంలో ఇటీవలి కాలంలో జ్వరాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. రెండు నెలల వ్యవధిలో కొత్తమాజేరు గ్రామంలో 18 మంది చనిపోవటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా అభివర్ణించారు. ఇప్పటికీ ఈ విషయంలో ముఖ్యమంత్రి దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగతా ప్రాంతాల్లో ప్రజారోగ్యం పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

కొత్తమాజేరులో జరిగిన మరణాలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే నిపుణులైన వైద్య బృందాన్ని ఈ ప్రాంతానికి పిలిపించి శిబిరం నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోతే.. తాను స్వయంగా బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతానన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇలా జగన్.. చంద్రబాబుకు గడువులు ఇవ్వడమేంటో అర్థంకాక సొంత పార్టీ నాయకులే జుట్టు పీక్కుంటున్నారు. ఈ లోపు సర్కారు చర్యలు చేపట్టి ఆ క్రెడిట్ వారి ఖాతాలో వేసుకునే ఛాన్సుందంటున్నారు. మొత్తానికి జగన్ గడువుల వ్యవహారం సర్కారుకు లాభిస్తుందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: