తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ఒక్కసారిగా స్వామీజీ అవతారం ఎత్తారు. హిందూ మత విశ్వాసాలు, ఆచారాల్లోని శాస్త్రీయ దృక్పథం, హిందూ పురాణాల్లోని ఔన్నత్యం ఇత్యాది అంశాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారు. వాటి గురించి బహుధా ప్రచారం చేయడ తన ప్రాథమిక కర్తవ్యంగా ఆయన భావించినట్లున్నారు. అందుకే నల్గొండ జిల్లాలోని ఒక ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు అతిథిగా వెళ్లే అవకాశం వచ్చేసరికి ఆయనలోని ఆధ్యాత్మిక చింతన, ఆలోచనా దృక్పథం అన్నీ బయటకు వచ్చాయి. స్వామీజీ తరహాలో ఆయన బోధనలు చేశారు. 


స్వామిగౌడ్‌.. గతంలో తెలంగాణ ఎన్జీవోల సంఘ నాయకుడిగా ఉంటూ ప్రత్యేకరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. నిత్యం నుదుట బొట్టుతో నికార్సయిన హిందుత్వ వాదిలా ఆయన కనిపిస్తుండేవారు. ఉద్యమంలో చిత్తశుద్ధితో పోరాడిన స్వామిగౌడ్‌ కు అప్పట్లోనే రాజకీయ పదవుల హామీలు ఇచ్చిన కేసీఆర్‌.. రిటైరైన వెంటనే ఎమ్మెల్సీ చేయడంతో పాటూ.. కొత్త రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాగానే.. శాసనమండలి ఛైర్మన్‌గా కూడా గద్దెపై కూర్చోబెట్టారు. పదవులు హోదాలు అనూహ్యంగా మారాయి గానీ.. స్వామిగౌడ్‌ వ్యక్తిత్వం, ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. ఆయన నిత్యం ఇదివరకటి వ్యక్తిలాగానే చాలా సింపుల్‌గా ఉంటారని ఎరిగిన వారు అంటుంటారు. 


అలాంటి స్వామిగౌడ్‌ నల్గొండలో ఓ కార్యక్రమానికి వెళ్లి.. హిందువులు.. హిందువుగా తమ అస్తిత్వం అందరికీ తెలిసేలా.. జీవించడంలోని అవసరం, ఔన్నత్యం గురించి ప్రత్యేకంగా ప్రసంగించడం జరిగింది. హిందువులు అందరూ నుదుట బొట్టు పెట్టుకోవాలని, తమ ఇళ్ల మీద భగవధ్వజాన్ని కట్టాలని ఆయన సెలవిచ్చారు. ఇలా బొట్టు, భగవధ్వజం అనేవి ఆరెస్సెస్‌ ప్రచారంలాగా ఉండవచ్చు గానీ.. ఆయన అచ్చంగా ప్రతి హిందువూ పాటించాలని చెప్పారు. పైగా బొట్టుకు ఒక మంచి రీజనింగ్‌ కూడా ఇచ్చారు. నుదుట బొట్టు కేవలం హిందుత్వానికి నిదర్శనం మాత్రమే కాకుండా.. మనలోని అహం బయటకు రాకుండా ఉండేందుకు కూడా తోడ్పడుతుందన్నారు. శాంతంగా ఉండడానికి ఇది దారితీస్తుందన్నారు. 


అన్నిటినీ మించి ప్రతి గ్రామ సర్పంచి ఇంట్లో మహాభారతం, భగవద్గీత పెట్టుకోవాలని వాటిని చదువుతూ ఉంటే.. సుపరిపాలన గురించి బాగా అర్థమవుతుందని స్వామిగౌడ్‌ చెప్పడం విశేషం. పరిపాలన విధానం మనకు మహభారతగ్రంథంలో తెలుస్తుందని అన్నారు. అయినా ప్రపంచం మొత్తం రామరాజ్యం అంటూ రాముడి పరిపాలనతీరుల గురిచి చెబుతుంటారు గానీ.. స్వామిగౌడ్‌.. భారతం చదివి పరిపాలన లోతుపాతులు తెలుసుకోవాలని సూచించడం విలక్షణంగానే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: