మహాటీవీ.. లబ్దప్రతిష్టులైన పాత్రికేయులు ఐ.వెంకట్రావ్, కట్టా శేఖర్ రెడ్డిల సారథ్యంలో మొదలైన ఈ వార్తా ఛానల్.. అంతా ఆశించినంత సక్సస్ కాలేకపోయింది. ఐ. వెంకట్రావ్ వంటి పాత్రికేయుడే యజమాని కావడంతో భాద్యతాయుతమైన జర్నలిజం ఆశించవచ్చని ఈ ఛానల్ పై పాత్రికేయులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ ఛానల్ ను అంతగా ఎదగనీయలేదు.  

తెరపైకి ఐ. వెంకట్రావ్ యజమానిగా ఉన్నా.. తెరవెనుక సుజనా చౌదరి పెట్టుబడులు ఇందులో ఉన్నాయన్న సంగతి బహిరంగ రహస్యమే. ఐతే.. వీరిద్దరేనా..ఇంకా భాగస్వాములు ఉన్నారా అన్న సంగతి కూడా క్లారిటీ లేదు. జనాన్ని ఆకట్టుకోవడంలో ఆది నుంచి విఫలమైన ఈ మహాటీవీ.. పదిహేను వార్తాఛానల్లో తాను ఒకటిగా మిగలడం మినహా ఎలా ప్రత్యేక ముద్రా వేయలేకపోయింది. ప్రారంభించిన ఏడాది తర్వాత కట్టాశేఖర్ రెడ్డి నమస్తే తెలంగాణ కోసం బయటకు  వెళ్లిపోయారు.

జర్నలిజం, వార్తల సంగతి దేవుడెరుగు.. రెండు, మూడేళ్ల నుంచి కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేక అబాసుపాలైంది. జీతాలు అందక కాస్తో కూస్తో సత్తా ఉన్న జర్నలిస్టులంతా తలో దిక్కూ చెదిరిపోయారు. అప్పటి నుంచి విపరీతమైన సిబ్బంది కొరతతోనే జూనియర్లతోనే.. ఏదోలా బండి నెట్టుకొస్తోంది. ఐతే టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక కాస్త మహాకు వెలుగు వచ్చింది.  

ఆంధ్రజ్యోతితో పాటు మహా టీవీకి కూడా సర్కారు కార్యక్రమాల ప్రసారాల కాంట్రాక్టు దక్కినట్టు తెలుస్తోంది. ఆ సొమ్ముతోనే ఇటీవల మళ్లీ రెగ్యులర్ గా జీతాలు ఇస్తున్నారట. పాత బాకీల సంగతి ఎత్తవద్దు కానీ.. ఇకపై మాత్రం ఠంచన్ గా జీతాలిస్తామని చెబుతున్నారట. అంతేకాదు.. ఒక్కసారిగా మ‌హా టీవీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కీల‌క విభాగాల్లో త‌ల‌కాయ‌ల మార్పు జ‌రుగుతోంది. మాజీ బాస్ ఐ. వెంకట్రావ్ త‌న‌యుడు అనిల్ మళ్లీ యక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారట. 

మొదట్లో లైవ్ డిస్కషన్లు కో ఆర్డినేట్ చేస్తూ వచ్చిన శివప్రసాద్.. ఔట్ పుట్ ఎడిటర్ కేశవ్ కూడా టాటా చెప్పేశాక ఔట్ పుట్ ఎడిటర్ గా వ్యవహరించారు. ఏదీ లేని చోట ఆముదపు వృక్షమే మహా వృక్షమైనట్టు.. శివప్రసాద్ హవాయే నిన్న మొన్నటి వరకూ సాగింది. కానీ లేటెస్టుగా.. అవుట్ పుట్, ఇన్ ఫుట్ ఎడిట‌ర్ల‌లో మార్పులు జ‌రిగిపోయాయి. 6 టీవీ నుంచి సి.ఎల్.ఎన్.రాజును తీసుకొచ్చి ఔట్ పుట్ ఎడిటర్ చేసేసరికి శివప్రసాద్ గొంతులో పచ్చి వెలక్కాయపడింది. ఇంకా పలు మార్పులు ఉంటాయని సంకేతాలు వస్తున్నాయి. మరి ఈ మహా మార్పులు.. ఆ ఛానల్ కు వెలుగులిస్తాయా.. అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: