చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్- మున్సిపల్ ఛైర్మన్ ల వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఈ ఇష్యూను టీడీపీ, వైసీపీ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో క్రమంగా చిత్తూరు పరిధులు దాటి  ఉమ్మడి రాజధానికి చేరింది. స్వాతంత్ర్యదినోత్సవం ముందు రోజు జరిగిన చిన్న గొడవ కేసులు పెట్టుకునేవారకూ .. అర్థరాత్రి అరెస్టుల వరకూ వెళ్లింది. చిత్రమేమిటంటే ఈ ఇష్యూ నుంచి రెండు పార్టీలు రాజకీయాలే ఆశిస్తున్నాయి. 
 
మున్సిపల్ కమిషనర్ పై దాడి చేశారన్న ఫిర్యాదుతో వైసీపీ నాయకులను అరెస్టుకు పోలీసులు ప్రయత్నించారు. తన అనుచరులను టీడీపీ నాయకులు కావాలనే ఇబ్బంది పెడుతున్నారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చేతిలో ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడే వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. గాలిని కట్టడి చేయకపోతే.. చంద్రబాబు ఇంటి ముందే ధర్నా చేస్తానని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

రోజా విమర్శలపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణనాయుడు కూడా అదే రేంజ్ లో ఫైర్ అయ్యారు. నెలకోసారి నగరి వచ్చే సినీ నటి రోజాకు స్థానిక సమస్యలు, పరిస్థితులపై ఏమాత్రం  అవగాహన లేదని విమర్శించారు. రోజా తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని ప్రకటించారు. రోజా నోటికి అడ్డూ అదుపూ లేదని.. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ ను ఇలాగే తిట్టిందని గుర్తు చేశారు. రోజా విషయంలో ఆ పార్టీ అద్యక్షుడు జగన్ జాగ్రత్తపడాలని సూచించారు.

అప్పటివరకూ రాజకీయ విమర్శలకు వేదికైన ఈ ఇష్యూ.. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ కూ పాకింది. తనకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ రోజా మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. తోటి ఎమ్మెల్య ఈశ్వరి, నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి తదితరులతో కలిసి మానవ హక్కుల సంఘం కార్యదర్శి సుబ్రహ్మణ్యం కు వినతిపత్రం అంద చేశారు. ఈ రాజకీయాలన్నీ చూస్తుంటే.. మానవ హక్కుల కమిషన్ కూడా చివరకు ఓ ధర్నా చౌక్ లా మారే పరిస్థితి వచ్చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: