మనం ఏం జరగాలని కోరుకుంటామో..దాని గురించే ఎక్కువ ఆలోచిస్తాం. అలాంటి వార్తలనే ఎక్కువగా నమ్ముతాం.. వైఎస్సార్ సీపీ నాయకుల తీరు కూడా అలాగే ఉంది. అతి తక్కువ శాతం ఓట్ల తేడాతో మొన్నటి ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేకపోయామని బాధపడుతున్న ఆ పార్టీ నేతలు.. మళ్లీ అధికారం గురించే ఆలోచిస్తున్నారు.  మరికొందరు ఔత్సాహికులైతే.. చంద్రబాబు పనైపోయింది..ఇక త్వరలోనే జగన్ సీఎం అవుతాడంటున్నారు. 

రెండేళ్లలోనే జగన్ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నానని నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అంటున్నారు. వందల కొద్దీ హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయని చంద్రబాబు త్వరలోనే రాజీనామా చేయాల్సిన అవసరం వస్తుందని ఆయన ఊహిస్తున్నారు. మచిలీపట్నంలో వైసీపీ నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ కామెంట్లు చేశారు. చంద్రబాబు కరవుకు బ్రాండ్ అంబాసిడర్ అని.. ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడూ.. ఇప్పుడూ కరవు పరిస్థితులే ఉంటున్నాయని అంటున్నారు అప్పారావు. 

మరి అప్పారావు కోరిక నెరవేరే అవకాశం ఎంతవరకూ ఉంది. మరో నాలుగేళ్లలో జరగాల్సిన ఎన్నికలు రెండేళ్లకే జరుగుతాయా.. అలా జరిగే అవకాశం ఎంత మాత్రం కనిపించడం లేదు. టీడీపీకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి పాలన ఎలా ఉన్నా.. చంద్రబాబే మరో నాలుగేళ్లు సీఎం అవుతారు. అంతగా కావాలంటే రెండేళ్లయ్యాక లోకేశ్ ను ఆ కుర్చీలో కూర్చోబెడతారు. అంతే తప్ప మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. 

కాకపోతే ఆంధ్రాలో టీడీపీ- బీజేపీ జోడీ కష్టకాలం మొదలైనట్టు చెప్పుకోవాలి. ఎన్నికల హామీలు సరిగ్గా నెరేవేర్చలేకపోవడం, ప్రత్యేక హోదా సాధించలేకపోవడం, కరవు పరిస్థితులు, రాజధాని వ్యవహారం.. ఇలా వరుస వైఫల్యాలు కొనసాగితే.. చంద్రబాబుపై జనంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో అది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదేమైనా వైసీపీ నేతల మాటలు వింటుంటే.. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా అన్న సామెత గుర్తొస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: