పోలవరం ఆంధ్రుల కలల ప్రాజెక్టు.. ఇదొక్కటి సాకారమైతే చాలు.. అటు విశాఖ పట్నం నుంటి ఇటు రాయలసీమ వరకూ నీటి కష్టాలు తీరతాయి. గోదాట్లో వృథాగా పోయే దాదాపు 500 టీఎంసీలు జనం బాగు కోసం వాడుకలోకి వస్తాయి. ఎప్పుడో బ్రిటీష్ కాలంనాటే ఆలోచన రూపుదిద్దుకున్నా.. అది పట్టాలెక్కడానికి మాత్రం దశాబ్దాల తరబడి ఆలస్యం జరుగుతోంది. 

రాష్ట్ర విభజన ఆంధ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి..అందుకు పరిహారంగా పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కట్టిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టుకు అయ్యిన వ్యయాన్ని కూడా తిరిగిస్తానంది. అంతేకాదు.. పోలవరం నిర్మాణానికి అడ్డుగా నిలిచే ముంపు గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ మోడీ సర్కారు తొలి భేటీలోనే నిర్ణయం తీసుకుంది. మరి అంతటి మహత్తరమైన పోలవరం ప్రాజెక్టును ప్రతిపక్షనేత అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారా..?

పోలవరం ఒక్కటే కాదు... ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా జగన్ అడ్డుపడుతున్నారా.. ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ రెండింటి విషయంలో జగన్ అడ్డుపుల్లలు వేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఊరికే ఆరోపణలు చేయకుండా గట్టి  ఆధారాలే సేకరించినట్టు చెబుతున్నారు. రాజధాని, పోలవరం విషయంలో ఓ మాజీ జర్నలిస్టు జగన్ ప్రోద్బలంతోనే.. అటు సుప్రీంకోర్టులోనూ.. ఇటు గ్రీన్ ట్రైబ్యునల్ లోనూ ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారని చెబుతున్నారు. 

ఓ ఎల్ ఐ జీ క్వార్టరులో నివసించే ఆ మాజీ జర్నలిస్టు... సుప్రీంకోర్టులోనూ, గ్రీన్ ట్రైబ్యునల్ లోనూ లక్షలకు లక్షలు ఫీజులిచ్చి లాయర్లను పెట్టుకుంటున్నాడని.. ఆయన్ను జగనే వెనకుండి నడిపిస్తున్నాడని విమర్శిస్తున్నారు. సదరు జర్నలిస్టు ఈ కేసుల నిమిత్తం తరచూ ఢిల్లీ, హైదరాబాద్ మధ్య విమానాల్లో తిరుగుతున్నారని.. అదంతా జగన్ సొమ్ముతోనే సాధ్యమవుతుందని అంటున్నారు. అంతే కాదు.. ఈ విషయంపై సర్కారు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోందని.. త్వరలోనే ఈ గుట్టు రట్టు చేస్తుందని అంటున్నారు. మరి నిజం నిలకడ మీద కానీ తెలియదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: