సమకాలీన రాజకీయాలపై పూరీ జగన్నాథ్ ఆ మధ్య కెమేరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీశాడు. చూశారా.. చూసే ఉంటారు. అందులో పవన్ కల్యాణ్ క్లైమాక్సులో జనాన్ని ఉధ్దేశిస్తూ ఓ ప్రసంగం చేశారు. ఏదైనా సమస్యను జనం తమదిగా భావించి ముందుకు కదిలివస్తే పరిష్కరించడం అసాధ్యం కాదని చెబుతారు. ఆ సన్నివేశంలో పవన్ కల్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం ఉంటుంది గుర్తుందా..?

టీవీ చూస్తూ ప్రసంగించిన పవన్.. ప్రేక్షకులను ఉద్దేశించి.. నిన్నే.. ఏయ్.. నిన్నే.. నీ గురించే చెబుతున్నా.. ఇంకా మేలుకోవా.. అలాగే ఉంటావా.. అంటూ పవన్ ఆవేశపడిపోతుంటే.. చూసే ప్రతి ఒక్కరూ అది తమనే అనుకుని ఉలిక్కిపడతారు. పవన్ పిలుపుకు స్పందించి హైదరాబాద్ బయలుదేరతారు. ఈ సీన్ ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యింది. సినిమా కాబట్టి చూడటానికీ బాగానే ఉంది. 

మరి ఇదే తరహా ప్రసంగం ఓ నాయకుడు చేస్తే ఎలా ఉంటుంది. అందులోనూ స్వయంగా మంత్రిగారు.. భలే ఉంటుంది కదా అనుకుంటున్నారు.. కదూ.. ఓ ఆంధ్రా మంత్రి ఆ పనే చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ పై విమర్శలు సంధిస్తూ.. పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డిని నేరుగా తిడుతూ.. ఏయ్... జగన్ మోహన్ రెడ్డీ.. నిన్నే.. నీ గురించే మాట్లాడుతున్నా.. అంటూ రెచ్చిపోయారు. 

ఈ ప్రెస్ మీట్ జగన్ నేరుగా చూస్తున్నట్టు ఫీలైపోయిన దేవినేని.. దమ్ముంటే నువ్వే చర్చకు రా... నా ప్రశ్నలకు సమాధానం చెప్పూ అంటూ టీవీ సాక్షిగా నిలదీశారు. ఇదిగో.. నీకే చెబుతున్నా.. అంటూ లైవ్ లో జగన్ తో కనెక్టయి పోయారు. పాపం.. దేవినేని అంతగా అరచినా.. మీడియా సాక్షిగా గర్జించినా జగన్ పట్టించుకున్నట్టు లేరు. అందుకే తమ నేత బొత్స సత్యనారాయణతో కౌంటర్లు ఇప్పించారు. ఏదేమైనా దేవినేని పవన్ ఇమిటేషన్ మాత్రం అదిరిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: