గత ఎన్నికల్లో ఎలాగోలా నెట్టుకొచ్చినా ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం కష్టకాలమే నడుస్తోంది. ఓ వైపు కొండంత భారంగా ఎన్నికల హామీలు.. మరోవైపు.. అనుకున్నంతగా సహకరించని కేంద్రం.. ఈ రెండింటి మధ్యలో ఆయన నలిగిపోతున్నారు. దీనికితోడు రాజధాని భూసేకరణ సమస్య ఒకటి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి ఏదో రకంగా హామీ ఇప్పించుకుని గౌరవప్రదంగా తిరిగొద్దామనుకున్నా ఆ ఆశలు అంతగా ఫలించినట్టులేవు..

నేరుగా ప్రధాని సైతం ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పని పరిస్థితి. ఈ సమయంలో చంద్రబాబును మరో ఇష్యూ ఇరుకున పెట్టింది. అదే బెజవాడ మెట్రో వ్యవహారం. కనీసం 20 లక్షల జనాభా కూడా లేకుండా బెజవాడ మెట్రో నిర్మాణం సాధ్యం కాదని సెంటర్ చెప్పేసింది. దీనిపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న బాబుకు చిర్రెత్తించింది. 

నీతి ఆయోగ్ ఉపసంఘం అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు.. స్వచ్ఛభారత్ కార్యక్రమ నిర్వహణపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారు. ఆ వివరాలు ఢిల్లీ లో మీడియాకు వివరించారు. ఆ ప్రెస్ మీట్ ముగుస్తున్న తరుణంలో మన తెలుగు మీడియా మిత్రులు ఊరుకుంటారా.. కేంద్రం నిధులేమయ్యాయని రొటీన్ ప్రశ్న వేశారు. దానికి కూడా ఓపిగ్గానే చంద్రబాబు సమాధానం చెప్పారు. అన్నీ  సాధిస్తామని రొటీన్ భరోసా ఇచ్చారు. 

సరిగ్గా ఆ సమయంలో ఓ కుర్ర జర్నలిస్టు ఏం సార్ .. బెజవాడ మెట్రో విషయంలో మీకు ఇబ్బంది వచ్చినట్టుంది.. కేంద్రం అది వర్కవుట్ కాదని కామెంట్ చేసింది కదా.. మీరేమంటారు అని అడిగారు. అంతే అప్పటివరకూ ఏదోలా సహనం వహించిన సీఎం గారు కారెక్కబోతూ.. బరస్టయ్యారు. ఎవరు చెప్పారు.. నీకు తెలుసా.. నువ్వనుకుంటే అయిపోయిందా.. అంటూ ఫైరయ్యారు. 

ఈ లోపు పక్కనున్న మరో జర్నలిస్టు కూడా అందుకున్నాడు.. బెజవాడ మెట్రో వయబుల్ కాదని.. కేంద్రం చెప్పింది కదా సార్.. అని బాబును ప్రశ్నించాడు. అసలు ప్రపంచంలో మెట్రోలు ఎక్కడా వయబుల్ కాదు.. వాటిని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందే. అలా ఆదుకునేలా ఒత్తిడి తెస్తాం అంటూ కారెక్కి చక్కాపోయారు. ఈ లెక్క చూస్తే బెజవాడ మెట్రో కూడా పట్టాలెక్కడం కష్టమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: