మీడియా రంగంలో ఈనాడు - సాక్షి పత్రికల మధ్య ఉన్న విబేధాలు అందరికీ తెలిసినవే. ఈనాడు ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ.. వైఎస్ కలల మీడియాగా  ఆవిర్భవించిన సాక్షి మీడియా ఈనాడుకు గట్టి షాకే ఇచ్చింది. ఈనాడు సర్క్యులేషన్ స్థాయిని అందుకోలేకపోయినా.. అప్పుడప్పుడూ దాని దరిదాపుల్లోకి వచ్చి షాకులిస్తూనే ఉంది.

కాకపోతే జగన్ బాకా ఎక్కువైపోయిన క్రెడిబిలిటీ రోజు రోజుకూ తగ్గిపోవడం సాక్షి మైనస్. కానీ.. ఈనాడు స్థాయి అందుకోలేకపోయినా.. కొన్ని విషయాల్లో సాక్షి పై చేయి స్పష్టంగా కనిపిస్తుంది. న్యూస్ విషయంలో జగన్ కలర్  కనిపించినా ఫీచర్స్ విషయంలో మాత్రం ఈనాడుకు చెక్ పెట్టింది. మొత్తం కలర్ పేజీలతో  ఫ్యామిలీ ఎడిషన్లో కొత్త ఫీచర్లతో తన మార్కు చాటుకుంటోంది. 

ఐతే.. ఈనాడు ప్రస్థావన సాక్షిలోనూ.. సాక్షి ప్రస్తావన ఈనాడులోనూ కనిపించడం అరుదే.. ఏరోజైనా కనిపించిన కచ్చితంగా అవి నెగిటివ్ వార్తలే అయి ఉంటాయి. సాక్షి ప్రారంభమైన మొదట్లో ఈనాడు అక్రమాలు అంటూ ప్రత్యేకంగా కొన్నిరోజులపాటు వ్యతిరేక కథనాలు ఇచ్చింది. మొదట్లో వీటికి స్పందనగా ఈనాడు వివరణ కథనాలు ఇచ్చినా ఆ తర్వాత మానేసింది. 

ఐతే.. ఈ శనివారం సాక్షి దినపత్రికలో ఈనాడు టెలివిజన్ కు సంబంధించిన యాడ్ కనిపించింది.  ఈటీవీ ప్రతిష్టాత్మకంగా మిర్చి మ్యూజిక్ అవార్డ్ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. దీని ప్రసారం ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఉంటుందట. మరి ఈ యాడ్ ఈనాడు గ్రూప్ ఇచ్చిందో.. లేక స్పాన్సర్లుగా ఉన్న ఐడియా సెల్యులార్ కంపెనీ వారే ఇచ్చారో తెలియదు గానీ.. మొత్తానికి ఈటీవీ యాడ్ సాక్షి పేపర్లో కనిపించి షాక్ ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: