ప్రత్యేక హోదా కోసం చేసిన బంద్ యావరేజ్ హిట్ కావడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఖుషీగా ఉన్నారు. అదే సంతోషంలో.. శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టేశారు. ఈ ప్రెస్ మీట్ విశేషం ఏమిటంటే చాలా రోజుల తర్వాత జగన్ ఒక్క చంద్రబాబునే కాకుండా.. కాస్త బీజేపీపైనా విమర్శలు చేశారు. మరి ప్రత్యేక హోదా విషయంలో రెండు పార్టీల పాత్ర కూడా ఉండటంతో ఆ పని చేయక తప్పలేదు. 

ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు బీజేపీ చెబుతున్న సాకులు.. అంతకు ముందు తెలియదా అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క చంద్రబాబునే విమర్శిస్తే బావుండని బీజేపీని కూడా నాలుగు మాటలు అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీలోని ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అనే నినాదాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

14వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి సంబంధం లేదని జగన్ అన్నారు. అన్నీ తెలిసి కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించే విషయంలో వెనకడుగు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.  ఢిల్లీ వెళ్లి మోదీని కలుస్తున్నారే తప్ప ఆయనతో ప్రత్యేక హోదా పై ఏమీ చర్చించడం లేదని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే...ఈ పాటికే  కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకునే వారన్నారు. 

ప్రత్యేక హోదా కోసం వైసీపీ బంద్ కు పిలుపు ఇస్తే.. దాన్ని ఫెయిల్ చేయించేందుకు చంద్రబాబు.. అన్ని రకాల ప్రయత్నాలు చేశారన్నారు.. దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని.. జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేశారని మండిపడ్డారు. ఈ అణచివేత ప్రయత్నాలు చూస్తుంటే చంద్రబాబు ప్రత్యేక హోదాకు అనుకూలమో...వ్యతిరేకమో అర్థం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము పిలుపునిచ్చిన బంద్ కు సహకరించిన అన్ని వర్గాలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: